మళ్లీ రగులుతున్న మణిపూర్.. తాజా హింస ఎందుకు?
రెండు తెగల మధ్య చోటు చేసుకున్న వైరం అంతకంతకూ పెరిగి పెద్దది కావటమే కాదు.. నిర్దాక్షిణ్యంగా చంపేసే వరకు వెళ్లిపోయింది.
రెండు తెగల మధ్య చోటు చేసుకున్న వైరం అంతకంతకూ పెరిగి పెద్దది కావటమే కాదు.. నిర్దాక్షిణ్యంగా చంపేసే వరకు వెళ్లిపోయింది. అవును.. మణిపూర్ లో గతంలో చోటు చేసుకున్న ఈ అరాచకంపై మోడీ2 సర్కారు సరిగా హ్యాండిల్ చేయలేదన్న విమర్శ పెద్ద ఎత్తున ఉంది. నెలల తరబడి రావణ కాష్ఠంగా మణిపూర్ మారింది. తాజాగా మరోసారి ఈ ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగింది. దీనికి కారణం తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే. కుకీ - మైతీ వర్గీయుల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజా ఉదంతంలో కుకీలు కిడ్నాప్ చేసిన మైతీ వర్గానికి చెందిన ఆరుగురి డెడ్ బాడీలు లభ్యం కావటంతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఆరుగురి మైతీల హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు చేపట్టారు. ఇవి కాస్తా తీవ్ర ఆందోళనగా మారాయి. బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో ఇంఫాల్ లో ఇద్దరు మంత్రులు.. ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడులకు దిగారు. దీంతో.. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ఎమ్మెల్యేల ఇళ్ల మీద అల్లరిమూకలు దాడులు చేసిన నేపథ్యంలో జిరిబామ్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ సేవల మీద బ్యాన్ విధించారు. మొబైల్ డేటా సేవల్ని సైతం నిలిపేశారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సపమ్ రంజన్ ఇంటిపై ఒక అల్లరిమూక దాడికి దిగిన విషయాన్ని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. అంతేకాదు.. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్ బంద్ ప్రాంతంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు.. బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో ఇంటి ముందు కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆరుగురు మైతీల హత్యకు కారణమైన నిందితుల్ని రోజు గడిచే లోపు పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరసనల వేళ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపం నిషికాంత సింగ్ ను ఆయన నివాసం వద్ద కలిసేందుకు కొందరు నిరసనకారులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో.. ఆగ్రహానికి గురైన వారు.. సదరు ఎమ్మెల్యేకు చెందిన ఒక లోకల్ న్యూస్ పేపర్ ఆఫీసు భవనాన్ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇంతకు ఆరుగురు మైతీల కిడ్నాప్ కు ముందు ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలింటెంట్లు జిరిబామ్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ మీద దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా భద్రతాదళాలు.. మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ భారీ ఎన్ కౌంటర్ తర్వాత ముగ్గురు మహిళలు.. మరో ముగ్గురు చిన్నారుల్ని కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి డెడ్ బాడీలను శనివారం గుర్తించారు. దీంతో.. మైతీ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు.