సిగ్గుచేటంటూ మణిపుర్ పై ఎట్టకేలకు నోరిప్పిన మోదీ

మణిపుర్ ఘటనను మోదీ తీవ్రంగా పరిగణించారు

Update: 2023-07-20 09:29 GMT

సరిగ్గా ఓవైపు పార్లమెంటు కొత్త భవనంలో వర్షాకాల సమావేశాల వేళ.. మణిపుర్ ఘటన కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. మూడు నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్ అల్లర్లపై నోరు విప్పనేలేదు.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మన్ కీ బాత్ కాదు మణిపూర్ కీ బాత్ మాట్లాడమంటూ పదేపదే ప్రశ్నించినా మోదీ మౌనమే సమాధానమైంది. మణిపుర్ అల్లర్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు.. స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లారు కానీ.. ప్రధాని మోదీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట మాత్రం స్పందించక తప్పలేదు. దీనికి కారణం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడమే. దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్టు కూడా చేశారు. మరోవైపు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలిచ్చింది.

కాగా, మణిపుర్ ఘటనను మోదీ తీవ్రంగా పరిగణించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపుర్ లో జరిగిన దుర్మార్గం దేశానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నిందితుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. 'మణిపుర్‌ లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ దాడి నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇది 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది. మణిపుర్ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేం. మహిళల భద్రత విషయంలో రాజీపడబోం. నిందితులను విడిచిపెట్టమని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నా. జరిగిన దుర్మార్గంపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. నిందితులను శిక్షించేందుకు చట్టం శక్తివంచన లేకుండా పనిచేస్తుంది'' అని మోదీ తెలిపారు.

కేంద్రం నష్ట నివారణ..

మణిపుర్ ఘటన తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టే ప్రమాదం ఉండడంతో కేంద్రం తక్షణమే స్పందించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ కు ఫోన్ చేశారు. ''మణిపుర్‌ లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించడం అత్యంత అమానవీయం. ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్‌ కు ఫోన్‌ చేసి ఆరా తీశా. దర్యాప్తు చేపడతున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు'' అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఇప్పటికే బీరేన్ సింగ్ పాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆయనను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, మహిళలపై జరిగిన దుర్మార్గం మీద స్పందిస్తూ ఘటనను సుమోటోగా పరిగణించి కేసు నమోదు చేశామని బీరేన్ తెలిపారు. మే 4న జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వైరల్‌ అయిన వీడియో ఆధారంగానే అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News