డీఎంకే కూటమిలో కమల్... కోయంబత్తూర్ నుంచి పోటీ?

ఇందులో భాగంగా తాజాగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎం.ఎన్.ఎం. రాష్ట్ర స్థాయి ప్రచారం "మక్కలోడు మైయం"ని కమల్ హాసన్ ఆదివారం ప్రారంభించారు.

Update: 2023-07-25 07:48 GMT

లోక నాయకుడు కమల్ హాసన్.. మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎం.ఎన్‌.ఎం) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ చూపించిన ప్రభావం అతి స్వల్పం. అయితే ఈసారి మాత్రం ఒంటరిగా కాకుండా... వీలైనంత వ్యూహాత్మకంగా, అనువైన పొత్తులతో, అనుకూలమైన చోట పోటీచేసే విధంగా కమల్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

అవును... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకురాలు, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పై కమల్ హాసన్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో చివరి వరకూ పోరాడిన కమల్... 1,728 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే ఈ సారి బలమైన పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో... రాష్ట్రంలో కాంగ్రెస్-డిఎంకె కూటమిలో చేరడంపై నిర్ణయం తీసుకోనప్పటికీ... ఆదిశగా ఆలోచన చేస్తున్నారని తెలిసింది. అయితే కమల్ మొదటినుంచీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక కార్యకలాపాలకు తన మద్దతును తెలియజేస్తున్నారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో" యాత్రలో కూడా కమల్ పాల్గొన్నారు. దీంతో బీజేపీ వ్యతిరేక విధానలతో ఏకీభవించే కమల్... డీఎంకే తో కలిసి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. అయితే మొన్న పాట్నాలో జరిగిన మీటింగ్ కి కానీ... తాజాగా బెంగళూరులో జరిగిన మిత్రపక్షాల సమావేశానికి కానీ కాంగ్రెస్ నుంచి కమల్ కు ఆహ్వానం అందలేదు!

అయితే ఈసారి మాత్రం కచ్చితంగా పొత్తులతోనే పోటీచేయబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... కమల్ హాసన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌ సభ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో కమల్ కు కోయంబత్తూరు సీటును కేటాయించేందుకు డీఎంకే ఆసక్తి చూపిస్తోందని కథనాలు వస్తున్నాయి.

అయితే పార్టీ చీఫ్ గా.. ఇప్పటినుంచే పార్టీ ప్రచార కార్యక్రమాలను కమల్ ప్రారంభించేశారు. ఇందులో భాగంగా తాజాగా కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎం.ఎన్.ఎం. రాష్ట్ర స్థాయి ప్రచారం "మక్కలోడు మైయం"ని కమల్ హాసన్ ఆదివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా... తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు.

అవును... తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో.. వార్డు, పంచాయతీ స్థాయిలో ప్రజలను కలవాలని యోచిస్తోందని తెలుస్తోంది. ఇదే సమయంలో అట్టడుగు స్థాయి ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌ బ్యాక్ ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టో ను రూపొందించాలని చూస్తున్నారని అంటున్నారు.

కాగా... డీఎంకే నాయకురాలు కనిమొళి... ఆమె నడుపుతున్న బస్సులో ఎక్కారనే వివాదంతో ఉద్యోగం నుండి తొలగించబడిన తమిళనాడు బస్సు డ్రైవర్ షర్మిలకు కమల్ హాసన్ ఇటీవల కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... కోయంబత్తూర్‌ లో నివాసముంటున్న షర్మిలకు కమల్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం కూడా... కమల్ అక్కడి నుంచే పోటీచేయబోతున్నారనే ఊహాగాణాలకు బలం చేకూర్తుస్తుందని అంటున్నారు.

ఇక, 2019 తమిళనాడు లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ 3.6 శాతం ఓట్లను సంపాదించుకోగా... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 180 సీట్లలో మాత్రమే పోటీచేసి 2.62% ఓట్లను సంపాదించుకొంది. ఇదే సమయంలో అదే ఏడాది పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ 22 సీట్లలో పోటీచేసి 1.89శాతం ఓటు బ్యాంకు సంపాదించుకుంది.

Tags:    

Similar News