తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి మధ్య పొత్తు పొడిచేనా?
దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయం తమిళనాడులో ఉంటుంది. జాతీయ పార్టీల ప్రభావం ఆ రాష్ట్ర రాజకీయాల మీద దాదాపుగా ఉండదనే చెప్పాలి
దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయం తమిళనాడులో ఉంటుంది. జాతీయ పార్టీల ప్రభావం ఆ రాష్ట్ర రాజకీయాల మీద దాదాపుగా ఉండదనే చెప్పాలి. బలమైన ప్రాంతీయ పార్టీల చేతికే అధికారం రావటం తెలిసిందే. దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ తీరుకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్లే పావులు కదుపుతోంది. జాతీయ పార్టీ ఏదైనా సరే.. తమిళనాడులోని ప్రాంతీయ పార్టీ ముందు తలొగ్గి.. దానితో కలిసి పని చేయాలే తప్పించి.. దాని మీద స్వారీ చేస్తామంటే కుదరని పరిస్థితి.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2026లొ జరగనున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ లో భాగంగా జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని.. అందుకు 2025 వేదికగా మారుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా అధికార డీఎంకే సర్కారును గద్దె దించాలని బీజేపీ తహతహలాడుతోంది. అందుకు ఎవరితోనైనా పొత్తుకు సై అంటోంది. తాజాగా ఇదే అంశాన్ని ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ - డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. డీఎంకేను తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని.. అందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపటం లేదంటే ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల వేళకు ఏదైనా జరగొచ్చన్న అన్నామలై.. ‘‘తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయటమే మా ధ్యేయం. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అంటూ ధీమాను వ్యక్తం చేశారు.
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఇదే అంశం 2025లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలతో మరింత స్పష్టంగా తెలుస్తుందన్న అన్నామలై వ్యాఖ్యలకు కాస్త భిన్నంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి.. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొనటం గమనార్హం. స్టాలిన్ సర్కారును ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్న ఆయన.. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతామని పేర్కొనటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు వేరు.. అసెంబ్లీ ఎన్నికలు వేరంటున్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయంటున్నారు. అయితే.. ఎవరికి ఆశ్చర్యకరంగా మారతాయన్నది అసలు విషయం. ఇందుకు మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.