ఉప ముఖ్యమంత్రి...గ్లామర్ పెంచింది ఆయనేనా ?
అయితే ఏపీలో మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవికి పొలిటికల్ గ్లామర్ తెచ్చింది అక్షరాలా పవన్ కళ్యాణ్ అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి అన్న పదవి రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదు. ముఖ్యమంత్రి ఆయన మంత్రులు అని మాత్రమే చెబుతారు. మంత్రులలో పెద్దగా లీడ్ చేసేవారుగా ముఖ్యమంత్రిని రాజ్యాంగం నిర్దేశించింది. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని అంటారు కానీ ఉప ముఖ్యమంత్రిగా అని ఎవరూ అనరు. మంత్రిగా మాత్రమే వారు ప్రమాణం చేయగలుగుతారు. అయితే ఈ ఉప ముఖ్యమంత్రి పదవిని ఎందుకు తెచ్చారు దాని అవసరం ఏమిటి అంటే అది పూర్తిగా రాజకీయ అవసరమే అని చెప్పక తప్పదు.
అదే విధంగా ఆ నాయకుడి గురించి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామన్న మెసేజ్ ని జనంలోకి పోనీయడానికి కూడా ఈ పదవిని ఇస్తూంటారు. కాంగ్రెస్ జమానాలో చూస్తే ఉమ్మడి ఏపీలో అనేక మంది ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక ఎన్టీఆర్ హయాంలో కానీ ఆ తరువాత చంద్రబాబు వైఎస్సార్ జమానాలో కానీ ఉప ముఖ్యమంత్రుల ప్రసక్తే లేకుండా పోయింది.
బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో కూడా ఉప ముఖ్యమంత్రి అన్నదే లేకుండా కేసీఅర్ పాలించారు. ఇక 2014లో విభజన ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరిని చంద్రబాబు తీసుకున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను అయిదుకు పెంచారు. ఇలా ఎవరికి ఈ పదవిని ఇచ్చినా వారంతా మంత్రులుగానే చలామణీ అయ్యేవారు తప్ప ఉప ముఖ్యమంత్రి పవర్ ఫోకస్ అయితే ఎక్కడా కనిపించినది లేదు.
ఇక 2023లో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉప ముఖ్యమంత్రి పదవిని క్రియేట్ చేసి భట్టి విక్రమార్కకు ఇచ్చారు. ఏపీలో 2024లో ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేనకి ఇచ్చారు. 2014లో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబు 2024లో మాత్రం ఒకే ఒక్కరికి ఈ పదవి ఇచ్చారు.
ఇవన్నీ పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిని ఆరవ వేలుగా చాలా మంది చెబుతారు. ఎందుకంటే ఎటువంటి ప్రత్యేక అధికారాలూ ఈ పదవికి లేవు. ఏ ఫైల్ అయినా సీఎం టేబిల్ దగ్గరకు వెళ్ళి ఆమోదముద్ర వీసుకోవాల్సిందే. అయితే ఏపీలో మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవికి పొలిటికల్ గ్లామర్ తెచ్చింది అక్షరాలా పవన్ కళ్యాణ్ అన్న విశ్లేషణలు ఉన్నాయి. స్వతహాగా ఆయన సినీ గ్లామర్ ఉన్న వారు.
ఆయనకు అపరిమితమైన అభిమాన గణం ఉంది. జనసేనానిగా కూడా బలమైన సామాజిక వర్గం వెన్నుదన్ను ఉంది. అంతే కాదు ఆయన పార్టీకి కొన్ని సెక్షన్లలో మంచి మద్దతు ఉంది. దీంతో పవన్ ని సీఎం గానే అంతా భావించారు. ఇపుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడంతో ఉప అన్నది సైలెంట్ గా చేస్తూ ముఖ్యమంత్రి అన్నది హైలెట్ గా సౌండ్ చేసుకుంటూ క్యాడర్ అయితే మురిసిపోతోంది.
పవన్ సైతం తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కీలక శాఖలు చూస్తున్నారు. దాంతో తనను తాను రుజువు చేసుకోవాలన్న ఆయన తాపత్రయం కూడా ఈ పదవికి వన్నె వాసి అద్దింది అని చెబుతున్నారు. ఆయన చేసే సంచలన ప్రకటనలు ఆయన పర్యటనలు ఆయన ఇచ్చే పదునైన ప్రకటనలు ఆయన దూకుడు రాజకీయం ఇవన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి మరీ ఇంత పవర్ ఫుల్ నా అని అనిపించేటట్లుగా చేశాయి.
అంతే కాదు పవన్ ఏపీ కూటమిలో జనసేన పార్టీతో మిత్రుడిగా ఉన్నారు. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో మిత్రుడిగా ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు వెనక పవన్ కూటమి కావాలన్న చొరవ ముఖ్య పాత్ర పోషించింది అన్నది కూడా ఉంది. దాంతో పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోదా కంటే కూడా ఈ అధికమైన రాజకీయ ప్రాధాన్యత వల్ల కూడా ఆయన పోస్టుకి అడిషనల్ వాల్యూ ఏర్పడుతోంది.
ఇలా అనేక కారణాలతో రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి చాలా మోజుని పెంచుతోంది. నిజానికి పవన్ కాకుండా అక్కడ మరో నేతకు ఈ పదవి ఇచ్చినా కూడా ఇంతటి గ్లామర్ అయితే ఉండేది కాదు అన్న మాట కూడ ఉంది. ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ తెచ్చిన గ్లామర్ తో రాబోయే రోజులలో ఈ పదవిని అందుకునేందుకు చాలా మంది ముందుకు వస్తారు అని అంటున్నారు. అయితే పదవులు కొందరికి అందం, మరి కొందరి వల్ల పదవులకు అందం అని అంటూటారు. అలా పవన్ ఉప ముఖ్యమంత్రి పదవికి కొత్త అందాలు తెచ్చారా అంటే అదే అక్షరాల నిజం అన్నది కూడా అంటున్నారు.