సెంటిమెంట్ ను దెబ్బతీసిన ట్రంప్... భారత్ లో లక్షల కోట్ల ఆవిరికి అదే కారణం!

ప్రధానంగా సుంకాల విషయంలో ట్రంప్ వ్యాఖ్యల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.

Update: 2025-01-21 16:52 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గా ఆయన చేసిన ప్రకటనలు భారత్ కు బిగ్ షాక్ కలిగించాయి. ప్రధానంగా సుంకాల విషయంలో ట్రంప్ వ్యాఖ్యల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫలితంగా... రూ.7 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైనట్లు చెబుతున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ సహా పలు దేశాలపైనా సుంకాల విధింపు తప్పదని గతంలోనే చేసిన వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయని అంటున్నారు. దీంతో... ఈ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.

దీనికి తోడు జొమటో, రిలయన్స్ వంటీ ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పాడేశాయి. దీంతో.. సెన్సెక్స్ ఓ దశలో 1,300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ కూడా 23,000 స్థాయిని కోల్పోయిన పరిస్థితి. ఫలితంగా... ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈ.లో నమోదిత కంపెనీల మొత్త విలువ సుమారు రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించింది.

ఈ సమయంలో డాలర్ తో రూపాయి మారకం విలువ 86.58గా ఉంది. అదేవిధంగా... సెన్సెక్స్ 30 సూచీల్లో ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు వచ్చే నెల 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News