గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇక గల్ఫ్ ఆఫ్ అమెరికా.. ఇదీ ట్రంపరితనం అంటే?
ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన ట్రంప్.. తొలి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు.
పనామా కాల్వ స్వాధీనం.. గ్రీన్ ల్యాండ్ అమ్మేయాలనే డిమాండ్లు.. మెక్సికో సరిహద్దుల్లో గోడ.. కెనడాను కలిపేయాలనే వ్యాఖ్యలు.. ఇవీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రేపిన సంచలనాలు..ఇక బాధ్యతలు స్వీకరించాక ఒకదాని మీద ఒకటి ఎగ్జిక్యూటివ్ ఉత్వర్వులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నుంచి వైదొలగారు.
కాగా, ఉత్తర అమెరికా ఖండంలోని జల సంధి గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఆరు లక్షల చదరపు మైళ్లతో ఇది ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరు. 16వ శతాబ్దంలో స్పెయిన్ అన్వేషకులు దీనిని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాక అధ్యక్షుడిగా గెలిచాక ట్రంప్ తన మార్ ఎ లాగో ఎస్టేట్ లో మాట్లాడుతూ తాను గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మారుస్తానని ప్రకటించారు. ఆ ప్రదేశం డ్రగ్ ముఠాల నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా సరిహద్దుల బలోపేతంలో భాగంగా దానిపై ఫోకస్ పెడతానని చెప్పారు.
ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన ట్రంప్.. తొలి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. ఆయన జారీ చేసిన వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లలో ఇది ఒకటి కావడం గమనార్హం.
పొరుగు దేశం మెక్సికో అంటేనే ట్రంప్ మొదటినుంచి మండిపడుతున్నారు. ఆ దేశం నుంచి డ్రగ్స్ అక్రమ సరఫరా జరుగుతుండడం, వలసదారులు చొరబడుతుండడంతో సరిహద్దుల్లో గోడ కట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. తొలి విడత అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గోడ నిర్మాణం మొదలుపెట్టినా తర్వాత ఆయన ఓటమితో నెమ్మదించింది.
ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చడాన్ని మెక్సికో వ్యతిరేకిస్తోంది. 1607లోనే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును వాడిన విషయాన్ని మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ ప్రస్తావించారు. ఇదివరకు అమెరికాను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించేవారని ఆమె పేర్కొనడం గమనార్హం.కాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రదేశంలో అమెరికాలో వాడే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికన్లు వాడే 40 శాతం సీ ఫుడ్ ఇక్కడిదే.
కొసమెరుపు: గ్రీన్ ల్యాండ్ పై కన్నేసిన ట్రంప్.. ఈ విషయం లో ఆ ప్రదేశంపై అదుపు ఉన్న డెన్మార్క్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ టీమ్ ఇప్పటికే గ్రీన్ ల్యాండ్ వెళ్లి చర్చలు జరిపింది.