తాడుకు కట్టేసి బైక్ తో లాక్కెళ్లారు..యూపీలో ఆరాచకం!
అమానుష ఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది
అమానుష ఘటన ఒకటి యూపీలో చోటు చేసుకుంది. బైక్ మీద వెళుతున్న ముగ్గురు కుర్రాళ్లు.. ఒక కుర్రాడ్ని తాడుకు కట్టేసి.. తాము మోపెడ్ మీద వెళుతూ.. రోడ్డు మీద లాక్కెళ్లిన ఉదంతం వెలుగు చేసింది. దాదాపు కీలో మీటర్ వరకు లాక్కెళ్లిన వైనం వీడియో రూపంలో బయటకు రావటంతో వైరల్ గా మారింది.
జులై 25న ఉత్తరప్రదేశ్ లోని బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే.. సదరు యువకులు ఎందుకిలా చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పట్టపగలు.. నడి రోడ్డు మీద కుర్రాడ్ని తాళ్లతో కట్టేసి.. తాము స్కూటీ మీద వెళుతూ.. లాక్కెళ్లిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
సదరు ఘటనలో తాళ్లతో కట్టేసి..రోడ్డు మీద లాక్కెళ్లిన కుర్రాడికి తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘోరానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యం కావటం.. ఆ వీడియో వైరల్ కావటంతో పోలీసులు అలెర్టు అయ్యారు. నడి రోడ్డు మీద జరుగుతున్న ఈ ఆరాచక ఉదంతాన్ని ఎవరూ అడ్డుకోకపోవటం.. అందరూ చూస్తుండిపోవటం విమర్శలకు గురి చేస్తోంది.
ఈ వీడియో వెలుగు చూసిన తర్వాత పోలీసులపై విమర్శలు వెల్లువెత్తటంతో.. నిందితుల్ని పట్టుకుంటామని.. కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. అయితే.. ఇంతటి అమానుషానికి కారణం ఏమిటన్నది తెలిస్తే తప్పించి.. ఇలాంటి పని ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితి.