ఇన్ స్టాలో రీల్స్... ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు!
ఇన్ స్టాలో రీల్స్ కోసం పసిగుడ్డును అంగడి సరుకులా మార్చేశారు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది.
ఐఫోన్ మోజు ఏస్థాయిలో ఉంటుందో తెలియజెప్పే సంఘటనలు ఇప్పటివరకూ ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ కోసం జరిగిన దొంగతనాలు, హత్యలు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరిగాయి. అయితే తాజాగా ఐఫోన్ కోసం కన్న బిడ్డను అంగట్లో అమ్మేశారు తల్లితండ్రులు. రీల్స్ మోజులో పేగుబందాన్ని లైట్ తీసుకున్నారు.
అవును... ఐఫోన్ కొనుక్కోవటంకోసం ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు. ఇన్ స్టాలో రీల్స్ కోసం పసిగుడ్డును అంగడి సరుకులా మార్చేశారు. సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. దీంతో మానవసంబంధాలు ఎక్కడికి పోతున్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్ కు చెందిన దంపతులు జయదేవ్, సాథీ నివసిస్తున్నారు. వారికి ఏడేళ్ల కూతురుతోపాటు ఎనిమిది నెలల మగబిడ్డ ఉన్నారు. వీరికి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలనే కోరిక పట్టుకుంది. దీంతో... ఇన్ స్టాలో రీల్స్ చేసి పోస్ట్ చేయాలని అనుకునారు. దీనికోసం తమ వద్ద ఉన్న ఫోన్ తో రీల్స్ మొదలుపెట్టారు.
అయితే ఐఫోన్ ఉంటే మరింత గొప్పగా, మరింత అందంగా, ఇంకాస్త ఆకర్షణీయంగా రీల్స్ చేయొచ్చని భ్రమపడ్డారు! కానీ వారి వద్ద అంత డబ్బులేదు. దీంతో తమ ఎనిమిది నెలల మగపిల్లాడిని బేరం పెట్టారు. ఈ క్రమంలో మాంచి బేరం రావడంతో అమ్మేసారు. బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బులు పట్టుకెళ్లి ఐఫోన్ కొనుక్కున్నారు.
ఈ క్రమంలో... నిత్యం వినిపించే చంటి బిడ్డ ఏడుపులు వినిపించకపోవడం, ఆ బిడ్డ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. దీంతో వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నలకు ఆ దంపతులు ఇద్దరూ... తమ బిడ్డను అమ్మేసి ఐఫోన్ కొన్నామని నిశ్చంకోచంగా చెప్పేశారు. దీంతో స్థానికులు షాక్ అయ్యారు.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు దంపతులను ప్రశ్నించగా.. సేం సమాధానం వచ్చింది. దీంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు, బిడ్డను ఎవరికి అమ్మారు.. ఎక్కడమ్మారు.. ఎంతకమ్మారు వంటి ప్రశ్నలు సందిస్తూ విచారిస్తున్నారని తెలుస్తోంది!