ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం.. కాలగర్భంలో కలిసిపోనున్న 150 ఏళ్ల చరిత్ర!

అయితే ఒక మార్గంలో ట్రాములు నడుపుతామని మమత ప్రభుత్వం చెబుతోంది.

Update: 2024-09-25 08:30 GMT

ఒకప్పుడు దేశానికి తొలి రాజధాని, దేశంలో అతిపెద్ద నగరం.. కలకత్తా. ఎంతో మంది దేశభక్తులు, ఎన్నో చారిత్రక సంఘటనలకు చరిత్ర ప్రసిద్ధి పొందిన కలకత్తా నగరంలో ఎన్నో పర్యాటక విశేషాలున్నాయి. వాటిలో ఒకటి.. కోల్‌ కతా ట్రామ్‌. ఈ ట్రామ్‌ లకు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు వీటిని మూసివేయాలని పశ్చిమ బెంగాల్‌ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

దేశంలో మెట్రోపాలిటన్‌ సిటీల్లో ఒకటిగా ఉన్న కలకత్తా నగర ప్రజలకు, ఆ నగరానికి వచ్చే పర్యాటకులకు అతిపెద్ద విశేషం.. ట్రామ్‌. ఇప్పుడు ఈ ట్రామ్‌ లను నిలిపివేయాలని మమత ప్రభుత్వం నిర్ణయించడం కాకరేపుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు.

అయితే ఒక మార్గంలో ట్రాములు నడుపుతామని మమత ప్రభుత్వం చెబుతోంది. అయితే వాటిని కూడా అతి త్వరలోనే మూసివేసే అవకాశముందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కలకత్తా అంటేనే ముందుగా గుర్తుకొచ్చే హౌరా బ్రిడ్జి, గంగా నదిలానే ట్రాము ప్రయాణం కూడా అక్కడ ప్రత్యేకం. అలాంటిది ట్రాములను మూసివేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

కాగా కలకత్తాలో 1873 ఫిబ్రవరి 24న అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ట్రాములను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదట ఉత్తర కలకత్తాలోని సీల్డా–అర్మేనియా ఘాట్‌ మధ్య 3.9 కిలోమీటర్ల మార్గంలో ట్రాములు నడిచేవి. వీటిని గుర్రాలతో లాగించేవారు. అయితే అదే ఏడాది నవంబర్‌ లో ట్రాముల నిర్వహణ ఇబ్బందికరంగా మారడంతో వాటిని బ్రిటిష్‌ ప్రభుత్వం ఆపేసింది.

మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత 1880 నవంబరులో ట్రాములు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 1882లో స్టీమ్‌ ఇంజన్లు, 1900లో ఎలక్ట్రిక్‌ ఇంజన్లను ప్రవేశపెట్టడంతో ట్రాముల రవాణా వ్యవస్థకు ఎదురు లేకుండా పోయింది.

ఇక 1943 నాటికి కలకత్తా నగరంతోపాటు హౌరా వరకు 70 కిలోమీటర్ల మేర ట్రాము రవాణా వ్యవస్థ విస్తరించింది. 1960 నాటికి ట్రాముల సంఖ్య 450కి చేరింది. ఇలా 1969 వరకు ట్రాములకు మంచి ఆదరణ దక్కింది. ప్రజలు వీటిలో ప్రయాణించడానికే మొగ్గు చూపేవారు.

అయితే 1970 నుంచి ట్రాము ప్రయాణ వ్యవస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి. బస్సులు, కార్లు, జీపులు, మోటారు సైకిళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ట్రాముల కంటే వేగంగా ప్రయాణించే అవకాశం లభించింది. దీంతో ట్రాములు ఎక్కేవారు తగ్గారు. దీంతో 1970లో హౌరాలోని బంధా ఘాట్, 1971లో శివపూర్, 1973లో నిమ్‌ తాలా ఘాట్‌ లలో ట్రాముల సేవలను నిలిపివేశారు.

ఇక 1984లో కలకత్తాలో మెట్రో రైళ్లు వచ్చాయి. మొదట్లో 70 కిలోమీటర్ల మేర తిరిగిన ట్రాముల వ్యవస్థ ప్రస్తుతం మూడు మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. ప్రస్తుతం రోజూ 3 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తొలిసారి 2011లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ట్రాముల్లో కోత విధించారు. అలాగే వాటి మీద ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని కూడా భారీగా తగ్గించారు. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాల్‌ చేస్తూ కలకత్తా హైకోర్టుల్లో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి.

ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్‌ సమర్పించింది. కలకత్తాలో ట్రాఫిక్‌ బాగా పెరిగిపోయిందని.. ఈ నేపథ్యంలో ట్రాముల వ్యవస్థ అవసర ం లేదని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 8 జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News