IIFAలో హేమ కమిటీ రిపోర్ట్ టాపిక్.. 'దసరా' విలన్ ఫుల్ సీరియస్!
మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశమైన అంశంగా మారిన విషయం తెలిసిందే.
మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశమైన అంశంగా మారిన విషయం తెలిసిందే. నివేదిక వచ్చిన నాటి నుంచి వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులంతా మలయాళ చిత్ర పరిశ్రమ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు అంతా తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో పలువురు నటీనటులు.. మహిళల రక్షణకు గట్టి మద్దతు తెలుపుతున్నారు.
ఇప్పుడు అబుదాబిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఐఫా అవార్డుల కార్యక్రమంలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ప్రస్తావనకు వచ్చింది! అవార్డులు వేడుకల్లో పాల్గొన్న మాలీవుడ్ యాక్టర్ షైన్ టామ్ చాకోకు నివేదికకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈవెంట్ లో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ ప్రతినిధి ప్రశ్నించగా.. టామ్ చాకో సీరియస్ అయ్యారు. అయితే ఇప్పటికే టామ్ చాకోపై ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అబుదాబిలో ఇప్పుడేం జరిగిందంటే?
హేమ కమిటీ రిపోర్ట్ వచ్చాక.. ఇప్పుడు మాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందని ఓ విలేకరి అడగ్గా.. ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని టామ్ చాకో అన్నారు. ఆ తర్వాత క్వశ్చన్ చేయడం తమ హక్కు అని సదరు మీడియా ప్రతినిధి చెప్పారు. దీంతో ఇది కరెక్ట్ కాదు.. హక్కు అనడం ఇంకా తప్పని వ్యాఖ్యానించారు టామ్ చాకో. హేమ కమిటీ నివేదికకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అబుదాబికి వచ్చారా అని విలేకరిని ఆయన ప్రశ్నించారు.
ఇది ఐఫా అవార్డుల వేడుక.. హేమ కమిటీ రిపోర్ట్ కు సంబంధించినది కాదని టిమ్ చాకో తెలిపారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల సమయంలో అలాంటి క్వశ్చన్స్ అడగడం సబబు కాదని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేచురల్ స్టార్ నాని దసరాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన టిమ్ చాకో.. ఆ సినిమాలో తన నటనతో మెప్పించారు. ఇప్పుడు అదే చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా ఐఫా అవార్డును అందుకున్నారు.
తాను మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వాడిని అయినా, టాలీవుడ్ ఫిల్మ్ (దసరా) కోసం ఐఫా వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని టామ్ చాకో చెప్పారు. ఇక దసరా తర్వాత.. తెలుగులో రంగబలిలో ఆయన నటించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలో కనిపించారు టామ్ చాకో. ఆ మూవీ సీక్వెల్ లో కూడా యాక్ట్ చేయనున్నారు. అదే సమయంలో పలు మాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.