భీమ్స్.. అతిపెద్ద మెగా మాస్ ఛాలెంజ్

ఇలా చూస్తే 2026 సంక్రాంతికి భీమ్స్‌కి ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. ఒకటి మాస్ మహారాజా రవితేజ సినిమా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి మూవీ.;

Update: 2025-03-19 17:07 GMT

సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమాలకు జాక్ పాట్ లాంటి ఫెస్టివల్. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పొంగల్ టైమ్ సాలీడ్ కలెక్షన్స్ వస్తాయి. అప్పుడప్పుడు ఈ సీజన్‌కి కేవలం హీరోలు మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పోటీపడటం విశేషం. గత సంక్రాంతికి థమన్ ఈ క్లాష్‌ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితిని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ కూడా ఎదుర్కొంటున్నాడు.

‘గేమ్ చేంజర్’ ‘డాకు మహారాజ్’ చిత్రాలకు థమన్ సంగీతం అందించాడు. రెండు సినిమాలు ఒకే సమయానికి విడుదల కావడంతో అతని పాటల గురించి భారీ చర్చ జరిగింది. సంగీత దర్శకుడిగా ఒకే సీజన్‌లో రెండు సినిమాలు రావడం సర్వసాధారణం కాదు. ఇప్పుడు అదే సవాలు భీమ్స్‌కి ఎదురవుతోంది. గత కొంతకాలంగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ హిట్ ఆల్బమ్స్ అందించిన భీమ్స్.. తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం భీమ్స్ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కోసం బిజీ అవుతున్నాడు. మొదటిది రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా. ఇంకా అధికారికంగా అనౌన్స్ కాకపోయినా, ఈ సినిమా 2026 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. మరోవైపు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో రాబోయే భారీ చిత్రం కూడా అదే సమయానికి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రానికి కూడా భీమ్స్‌ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడని టాక్.

ఇలా చూస్తే 2026 సంక్రాంతికి భీమ్స్‌కి ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. ఒకటి మాస్ మహారాజా రవితేజ సినిమా, మరొకటి మెగాస్టార్ చిరంజీవి మూవీ. ఇవి రెండూ భారీ మాస్ ఎంటర్టైనర్స్ కావడంతో భీమ్స్ మీద ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆడియెన్స్‌ను అలరించేందుకు తన పాటలకు, బీజీఎం‌కి పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకే సీజన్‌లో రెండు పెద్ద చిత్రాలకి మ్యూజిక్ అందించడం కొందరు మ్యూజిక్ డైరెక్టర్లకు మాత్రమే సాధ్యమైంది.

ఇప్పటివరకు భీమ్స్‌కి అలాంటి క్లాష్ ఎదురవ్వలేదు. అయితే 2026 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలపై ఎక్కువ అంచనాలే ఉన్నాయి. పాటలు పెద్ద హిట్ అయితే సినిమాల రేంజ్ పెరుగుతుంది. ఒకే సమయంలో రెండు సినిమాలకు మంచి ఆల్బమ్ ఇచ్చి తన మార్క్‌ చూపించగలడా లేక ఒకదానికొకటి ఇంపాక్ట్ తక్కువయ్యేలా చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇలా సంక్రాంతికి రెండు సినిమాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు భీమ్స్ కూడా అదే స్థాయిలో నిలబడతాడా అనేది చూడాలి. ఒకవేళ క్లిక్కయితే మాత్రం అతను టాప్ లీగ్ లోకి చేరుకున్నట్లే. థమన్, దేవి రేంజ్ లో నెక్స్ట్ భీమ్ పేరు స్ట్రాంగ్ గా వినిపించడం ఖాయం.

Tags:    

Similar News