సూపర్ స్టార్ మూవీ.. వయసు దాచేందుకు రూ.6 కోట్లు
విజయ్ ని 19 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడో అలాగే చూపించేందుకు ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తమిళనాట భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విజయ్ మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.
విజయ్ 68వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విభిన్న గెటప్స్ లో విజయ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే దర్శకుడు వెంకట్ ప్రభు పలు వేదికల మీద ప్రకటించాడు. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తమిళ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కథానుసారం ఈ సినిమాలో విజయ్ కొన్ని సన్నివేశాల్లో టీనేజ్ కుర్రాడిగా కనిపించాల్సి ఉందట. అందుకు మొదట మేకప్ ను ట్రై చేయాలని భావించారు. కానీ మేకప్ తో వర్కౌట్ అవ్వదని నిర్ణయానికి వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నారట.
మేకప్ తో పాటు టెక్నాలజీని ఉపయోగించి హాలీవుడ్ టెక్నీషియన్స్ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. విజయ్ ని 19 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడో అలాగే చూపించేందుకు ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
విజయ్ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబర్చుతున్నాడు. ఈ సినిమా కథ చాలా స్పెషల్ గా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. రాజకీయ నేపథ్యం లో ఈ సినిమా రూపొందబోతుందనే వార్తలు కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.