అమీర్ ఖాన్ కుమార్తె పెళ్లి సందడి
ఇప్పటికే ఇరా-నూపుర్ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇరా ఖాన్ ఫోటోలు - వీడియోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ జిమ్ కోచ్ నూపుర్ శిఖారేని ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఇరువైపులా పెద్దల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఇరాఖాన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. 2024 జనవరి 3న ఈ వివాహం జరగనుంది. ఇది డెస్టినేషన్ వెడ్డింగా లేక సింపుల్ గా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా సాగే పెళ్లా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పటికే ఇరా-నూపుర్ జంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఇరా ఖాన్ ఫోటోలు - వీడియోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో కాబోయే పెళ్లికూతురు ఇరా ఖాన్ ముగ్ధ మనోహర రూపం ఆకట్టుకుంది. పింక్ కలర్ లెహెరియా చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇరా ముక్కు పుడక సోయగం అద్భుతం .. తనతో పాటు ఆడపడుచులు బంధువులు కలిసి ముక్కుపుడకను ప్రదర్శిస్తున్న ఫోటోలు ఆకట్టుకున్నాయి. నుపుర్ శిఖరే పొడవాటి క్యాజువల్ ప్రింటెడ్ కుర్తా ధరించగా, ఇరా ఖాన్ తల్లి, అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూడా ఈ ఫోటోలు వీడియోలలో కనిపించారు.
జిమ్లో మొదలైన ప్రేమ:
అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్- నూపూర్ శిఖారే జంట 18 నవంబర్ 2022న నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. అయితే అక్టోబర్ 3న కోర్టు వివాహానికి సిద్ధమవుతున్నారని, ఆ తర్వాత ఉదయపూర్లో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవల కథనాలొచ్చాయి. అయితే ఈ పుకార్లను ఇరా ఖాన్ కొట్టి పారేసారు. ఇదివరకూ ఘనమైన నిశ్చితార్థానికి ఇరా తల్లిదండ్రులు, అమీర్ ఖాన్ - రీనా దత్తా, అలాగే ఇరా సవతి తల్లి కిరణ్ రావు సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఇరా-నూపుర్ జంట రొమాంటిక్ డేట్ 2022 సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. నూపూర్ ఇరాకు ఇటలీలో సినిమాటిక్ పద్ధతిలో ప్రపోజ్ చేయడంతో అసలు కథ మొదలైంది. ఇరా ఆ తర్వాత తన ఫాలోవర్స్ తో ప్రత్యేక క్షణాల గురించి వెల్లడించారు. తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే విడిపోవడంతో ఇరాఖాన్ తీవ్ర డిప్రెషన్కి గురైంది. చాలాకాలం పాటు ఒంటరి జీవితాన్ని గడపడంతో ఒత్తిడికి లోనైంది. కానీ నుపూర్ శిఖారే పరిచయం ఇరాఖాన్ లో ఆనందం నింపింది. ఈ జంట చాలా సంతోషంగా ఉన్నారు. ఇరా ఇష్టాయిష్టాలను గౌరవించి అమీర్ ఖాన్- రీనా దత్తా దంపతులు ఈ పెళ్లిని ఇష్టపూర్వకంగా జరిపిస్తున్నారని మీడియాలో కథనాలొచ్చాయి.