లేటు వయసులో లేడీ విలన్ గా...!
అయినా టాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం ఈమెకు దక్కలేదు.
పాతిక సంవత్సరాల క్రితం మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అభిరామి తెలుగు లో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె తెలుగు లో చేసిన చెప్పవే చిరుగాలి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, నటిగా ఆ సినిమా అభిరామికి విమర్శకుల ప్రశంసలు తెచ్చి పెట్టింది. అయినా టాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం ఈమెకు దక్కలేదు.
టాలీవుడ్ లో ఆఫర్లు రాకున్నా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేయడం ద్వారా అభిరామి ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత అభిరామి వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగు లో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె నాని సినిమా సరిపోదా శనివారం లో కీలకమైన పాత్రలో కనిపించింది. సూపర్ హిట్ మహారాజా సినిమాలోనూ అభిరామి నటించింది. ఇక రాజ్ తరుణ్ తాజా చిత్రం 'భలే ఉన్నాడే' సినిమాలోనూ అభిరామి కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్ లో భాగంగా అభిరామి మీడియా ముందుకు వచ్చింది. ఒక వైపు తమిళ్ లో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న తాను మరో వైపు మంచి పాత్రలు వస్తే ఎలాంటి సినిమాల్లో అయినా నటించేందుకు సిద్ధం అంటూ ప్రకటించింది. అంతే కాకుండా లేడీ విలన్ గా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే మీ ముందుకు ఒక సినిమా ద్వారా లేడీ విలన్ పాత్రతో వస్తానంటూ ప్రకటన చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. లేటు వయసులో లేడీ విలన్ గా కనిపించడం అంటే కచ్చితంగా సాహసమే.
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమా థగ్ లైఫ్ లో అభిరామి కీలక పాత్రలో కనిపించబోతుంది. మలయాళం మరియు కన్నడ సినిమాల్లో అభిరామి కీలక పాత్రలో నటిస్తోంది. యంగ్ ఏజ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన అభిరామి ఇప్పుడు మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇంకా గెస్ట్ రోల్స్ లో నటించడం వల్ల అభిరామి అన్ని భాషల్లో బిజీ బిజీ అయింది. ముందు ముందు మరిన్ని సినిమాల్లో అభిరామి నటించడం ఖాయం గా తెలుస్తోంది.