హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ కి బెయిల్
తాజాగా దర్శన్ తరుపు న్యాయవాది హైకోర్టులో అభ్యర్దించడంతో బెయిల్ మంజూరైంది.
ఎట్టకేలకు కన్నడ నటుడు దర్శన్ కి బెయిల్ దొరికింది. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జిబెంచ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ పిటీష్ కోసం పలుమార్లు దాఖలు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరుపు న్యాయవాది హైకోర్టులో అభ్యర్దించడంతో బెయిల్ మంజూరైంది.
దర్శన్ కి తీవ్రమైన నొప్పి ఉందని శస్త్ర చికిత్స అవసరమని, చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టరు ఇచ్చిన రిపోర్టుని దర్శన్ న్యాయవాది కోర్టుకు సమర్పించారు. డాక్టర్ రిపోర్టులో దర్శన్ కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న విశ్వేశర భట్, విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని పేర్కొంటూ షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసారు.
దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో జూన్ 11న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తొలుత పరప్పన్ అగ్రహారం జైలుకు తరలించిగా, అటుపై బళ్లారి జైలుకు మార్చారు. అయితే దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన సతీమణి బెయిల్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. బళ్లారి జైలుకు తరలించిన అనంతరం బెయిల్ పీటీషన్లు మరింత వేగవంతమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరికి బెయిల్ రావడంతో దర్శన్ కి కూడా బెయిల్ వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ కేసులో ఏ2 గా ఉండటం సహా సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో బెయిల్ సాధ్యపడలేదు. తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా మధ్యంత బెయిర్ మంజూరు అయింది. అయితే ఆరు వారాల తర్వాత మళ్లీ జైలుకెళ్లాల్సిందే.