రాజకీయాల్లోకి కూలీ నం.1 రీఎంట్రీ
ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గం నుంచి గోవింద పోటీ చేస్తారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి
వరుసగా ఫిలింస్టార్లు రాజకీయాల్లో చేరుతున్నారు. ఇప్పుడు అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ నటుడు గోవింద గురువారం (మార్చి 28) ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. తనకు రాజకీయ వనవాసాల (బహిష్కరణ) ముగింపు ఇది అని గోవింద ఈ సందర్భంగా అన్నారు. ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గం నుంచి గోవింద పోటీ చేస్తారనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ ప్రకటన తర్వాత సీనియర్ శివసేన నాయకుడు గజానన్ కీర్తికర్ మాట్లాడుతూ, ''గోవిందా ప్రచారంతో పార్టీ మరింత చురుగ్గా కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఆయనకు టికెట్ వస్తుందో లేదో తేల్చలేదు. శివసేన లో ఉన్న నటులు సచిన్ ఖేద్కర్ .. శరద్ పోంక్షే తదితరులు సీటు కోసం వేచి చూస్తున్నారు'' అని తెలిపారు.
గురువారం నారీమన్ పాయింట్‌లోని పార్టీ కార్యాలయం బాలాసాహెబ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు, మాజీ కాంగ్రెస్ ఎంపీ గోవింద ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరడంపై మాట్లాడారు. హిందీ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజకీయాల్లో రీఎంట్రీ తో ఈసారి స్థిరంగా కొనసాగుతానని అన్నారు.
ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుండి గోవిందా పోటీ చేస్తారా లేదా? అన్నది ఇంకా తేలలేదు. ఇదే నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి షిండే బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ ఆదిత్య థాకరే సహాయకుడు శివసేన (UBT) అభ్యర్థి అమోల్ కీర్తికర్‌తో తలపడతారని కూడా టాక్ ఉంది.
''నేను 2009లో రాజకీయాల నుంచి తప్పుకున్నాను, దాదాపు 14 ఏళ్ల వనవాసం తర్వాత ఇప్పుడు తిరిగి వచ్చాను'' అని పార్టీలోకి చేరిన తర్వాత గోవింద అన్నారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్ నాయక్‌పై విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఎంపీగా పేలవమైన పనితీరు కనబరుస్తున్నారని విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. గతంలో బోరివిలి-విరార్ సబర్బన్ రైల్వే లైన్‌ను నాలుగు రెట్లు పెంచేందుకు ఆయన శ్రీకారం చుట్టారు.
షిండే మాట్లాడుతూ, ''బాలీవుడ్ పరిశ్రమ చాలా పెద్దది. గోవిందా జీ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య లింక్‌గా వ్యవహరిస్తారు'' అని అన్నారు. గోవిందా మాట్లాడుతూ ''ముంబయి ఫిల్మ్ సిటీ ఆధునికతకు ఇది పునాది. ఏక్‌నాథ్ షిండే సీఎం అయిన తర్వాత నగరంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ముంబై అందంగా కనిపిస్తోంది'' అని అన్నారు.
90వ దశకంలో ఆంఖేన్, హీరో నంబర్ 1, కూలీ నంబర్ 1 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న గోవిందా దశాబ్ధాల పాటు కెరీర్ ని కొనసాగించారు. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ప్రచారంలో ఉన్న సమయంలో ఓటర్లను ఆకట్టుకునేలా పనిచేసిన ఆయన సామాన్యుల హీరో. అతడి స్టార్‌డమ్ 2006 నుండి పడిపోవడం మొదలైంది. తర్వాత అతడు భాగమ్ భాగ్, పార్ట్‌నర్ వంటి చిత్రాలలో అక్షయ్ కుమార్ - సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్‌లకు సహాయక పాత్రల్లో నటించాడు.
గోవిందా రాజకీయ పునరారంగేట్రంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ''శత్రుఘ్న సిన్హా, రాజ్ బబ్బర్ మినహా చాలా మంది నటులు రాజకీయాల్లో తమ పలుకుబడిని ఉపయోగించుకోలేకపోయారు. గోవింద గతంలో రాజకీయ నాయకుడిగా పెద్దగా సాధించిందేమీలేదు. అతడు ఇకపై నటుడిగా బిజీగా లేనందున ప్రజలకు కొంత మేలు చేయడానికి తన శక్తిని ఉపయోగించుకోగలడు'' అని వ్యాఖ్యానించారు.
అయితే మాజీ సీబీఎఫ్‌సి అధ్యక్షుడు పహ్లాజ్ నిహ్లానీ మాట్లాడుతూ, ''గోవింద రాజకీయ నాయకుడిగా.. అంతకుముందు కాలంలో సినిమా నటుడిగా తన గేమ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పుడు పరిశ్రమలో పెద్దగా కనిపించడం లేదు. కానీ రాజకీయాలకు తన 100 శాతం అందించి మరోసారి మెరుస్తాడు'' అని వ్యాఖ్యానించారు.