హోటల్‌లో పని చేసిన నటుడికి 225కోట్ల ఆస్తి?
బాలీవుడ్‌లో కొందరికి జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది. అక్కడ ఇలాంటి తారలు చాలా మంది ఉన్నారు.
బాలీవుడ్‌లో కొందరికి జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది. అక్కడ ఇలాంటి తారలు చాలా మంది ఉన్నారు. నటులుగా సినిమాల్లో విజయం సాధించకపోయినప్పటికీ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ నటుడు తన కెరీర్‌లో సోలో హిట్‌లను అందించడంలో విఫలమైనా కానీ..అతడు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాడు. భారీ అభిమానులను కలిగి ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ నటి బిపాసా బసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్.
కరణ్ సింగ్ గ్రోవర్ ఫిబ్రవరి 1982లో న్యూఢిల్లీలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో అతడి కుటుంబం సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ దమ్మామ్‌లోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసాడు. IHM ముంబై నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని అభ్యసించాడు. కరణ్ సింగ్ గ్రోవర్ నటనా రంగంలోకి రాకముందు ఒమన్‌లోని షెరటాన్ హోటల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు.
కరణ్ సింగ్ గ్రోవర్ 2008లో `భ్రమ్` సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. 2015లో బిపాసా బసుతో కలిసి `అలోన్` చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ ఫ్లాప్ అయినప్పటికీ, సెట్స్‌పై కరణ్ - బిపాసా ప్రేమలో పడ్డారు. ఆ ఇద్దరూ అధికారికంగా సంబంధాన్ని ప్రారంభించారు. కరణ్ సింగ్ గ్రోవర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 5 చిత్రాల్లో నటించాడు. ఒక్క సోలో హిట్ కూడా ఇవ్వలేదు. హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే జంటగా నటించిన ఇటీవలి చిత్రం `ఫైటర్` అతడికి మొదటి హిట్ చిత్రం.
కరణ్ సింగ్ సినిమాల్లో విజయవంతమైన కెరీర్‌ను ఆస్వాదించకపోవచ్చు కానీ.. అతడు టీవీ ప్రపంచంలో సూపర్‌స్టార్. కరణ్ సింగ్ దిల్ మిల్ గయే, కుబూల్ హై షోలు భారీ విజయాన్ని సాధించాయి. అతనిని భారతదేశంలో యూత్ ఐకాన్‌గా మార్చాయి. జూన్ 2019లో కరణ్ సింగ్ గ్రోవర్ మిస్టర్ రిషబ్ బజాజ్‌గా `కసౌతి జిందగీ కే`తో ఆరేళ్ల తర్వాత టెలివిజన్‌కి తిరిగి వచ్చారు. రోజుకు 3 లక్షలు వసూలు చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటుడిగా నిలిచాడు. తర్వాత షో నుంచి తప్పుకున్నాడు.
కెరీర్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, కరణ్ సింగ్ గ్రోవర్ విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం అతని నికర ఆస్తుల విలువ రూ. 224 కోట్లు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. కరణ్ సింగ్ గ్రోవర్ 2016 నుండి బిపాసా బసును వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు దేవి బసు సింగ్ గ్రోవర్ అనే కుమార్తె కూడా ఉంది. బిపాసాతో వివాహం కాకముందు కరణ్ సింగ్ గ్రోవర్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. కరణ్ 2008లో నటి శ్రద్ధా నిగమ్‌ని వివాహం చేసుకున్నారు. 10 నెలల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. అతడు ఏప్రిల్ 2012 లో జెన్నిఫర్ వింజెట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2014లో విడిపోయారు. ఆ తర్వాత బిపాసాతో ప్రేమాయణం పెళ్లి వగైరా తెలిసినవే.