పోలీసుల ఛార్జ్ షీట్.. హేమ రెస్పాన్స్ ఇదే..
అందులో హేమ పేరు ఉన్నట్లు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టులను పోలీసులు యాడ్ చేశారని ప్రచారం సాగుతోంది.
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది! నాలుగు నెలల క్రితం జరిగిన రేవ్ పార్టీ కేసుపై బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కొన్ని గంటలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 88 మంది పేర్లను నిందితులుగా 1086 పేజీల ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందులో హేమ పేరు ఉన్నట్లు.. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టులను పోలీసులు యాడ్ చేశారని ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఈ విషయంపై నటి హేమ స్పందించారు. తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని మరోసారి హేమ తెలిపారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ప్రూవ్ అయితే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఛార్జ్ షీట్ లో తన పేరు ఉందని ఇప్పుడు తెలిసిందని చెప్పారు. తనకు వచ్చిన సమాచారం మేరకు.. డ్రగ్స్ రిపోర్ట్ లో తన పేరు వద్ద నెగిటివ్ అని ఉందని తెలిపారు. MDMAనే కాదు.. తాను ఎలాంటి డ్రగ్స్ కూడా తీసుకోలేదని వివరించారు.
కొందరి వల్లే ఛార్జ్ షీట్ లో తన పేరును పోలీసులు చేర్చారని హేమ ఆరోపించారు. తన చేతికి ఛార్జ్ షీట్ కాపీ వచ్చాక మళ్లీ స్పందిస్తానని తెలిపారు. ప్రస్తుతం హేమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారన్న విషయం.. మరోవైపు హేమ లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మొత్తానికి మే నెలలో జరిగిన రేవ్ పార్టీ.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గానే ఉంది.
అయితే రేవ్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా, జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత సర్టిఫైడ్ ల్యాబ్స్ లో టెస్ట్ చేసుకున్నానని, నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాంటి తప్పు చేయలేదు కనుక.. బెయిల్ పై బయటకు వచ్చానని చెప్పారు. ఆ రిపోర్ట్స్ కాపీలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు పంపారు.
వాటిని పరిశీలించిన మా కమిటీ.. హేమపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే రేవ్ పార్టీ జరిగిన రోజు హైదరాబాద్ లోనే ఉన్నానని అప్పట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు హేమ. ఆ తర్వాత రోజు బిర్యానీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు పోలీసులు.. ఛార్జ్ షీట్ లో ఆమె పేరును యాడ్ చేశారు! మరి రేవ్ పార్టీ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.