రికార్డ్‌... 5వ సినిమాకు త్రిష సైన్‌!

తమిళ్‌, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న త్రిష కి మరో స్టార్‌ హీరో క్రేజీ మూవీ లో ఛాన్స్ దక్కినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Update: 2024-09-03 10:30 GMT

సీనియర్ స్టార్‌ హీరోయిన్‌ త్రిష హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలకు పైగా అయింది. సాధారణంగా హీరోయిన్స్‌ పదేళ్లు స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగడం గగనం. అలాంటిది రెండు దశాబ్దాలుగా త్రిష తన స్టార్‌డమ్‌ ను కొనసాగిస్తూనే ఉంది. 41 ఏళ్ల వయసులోనూ వరుసగా పెద్ద హీరోలతో బ్యాక్ టు బ్యాక్‌ క్రేజీ సినిమాల్లో నటిస్తున్న ఘనత ఈ అమ్మడికి దక్కింది. ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలను ఈమె చేస్తుంది. తమిళ్‌, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న త్రిష కి మరో స్టార్‌ హీరో క్రేజీ మూవీ లో ఛాన్స్ దక్కినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం త్రిష తెలుగు లో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. 2025 సంక్రాంతికి విశ్వంభర సినిమా తో త్రిష రాబోతుంది. తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కు జోడీగా విదా ముయార్చి సినిమాలో త్రిష నటిస్తోంది. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ఆ భారీ చిత్రం కూడా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మలయాళంలో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తో 'రామ్‌' అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పై మలయాళ సినీ ప్రేక్షకులతో పాటు తమిళ్‌, తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చుతున్నారు.

తమిళంలో మరో మూవీ థగ్ లైఫ్‌ లోనూ త్రిష నటిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతున్న థగ్ లైఫ్‌ లో త్రిష నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆసక్తి మరింత ఎక్కువ అయ్యింది. ఇంత మంది స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్న త్రిష మరో బిగ్‌ చిత్రంలో హీరోయిన్‌ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అదే అజిత్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా చకచక పనులు ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్‌ లో అజిత్‌ తో నిర్మించబోతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా లో త్రిష ను నటింపజేసేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే విభిన్నమైన టైటిల్‌ కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తమిళ్‌ లో అజిత్‌ సినిమా లు వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఈసారి తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో సినిమా రూపొందుతోంది కనుక అజిత్‌ కు హిట్ టాలీవుడ్‌ లో దక్కేనా చూడాలి. త్రిష ప్రస్తుతం నటిస్తున్న అన్ని తెలుగేతర సినిమాలూ తెలుగు లో డబ్‌ అవ్వబోతున్నాయి.

Tags:    

Similar News