ఐదేళ్ల తర్వాత సైన్ చేసిన ముద్దుగుమ్మ!
దాదాపు అయిదు సంవత్సరాలుగా పూర్తి స్థాయి హిందీ సినిమాను ప్రియాంక చోప్రా సైన్ చేసిందే లేదు
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా సినిమాలు సిరీస్ లు చేస్తూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడు అమెరికన్ ను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా హాలీవుడ్ కే పరిమితం అయ్యిందా అన్నట్లుగా హిందీ సినిమాలను వదిలేసింది.
దాదాపు అయిదు సంవత్సరాలుగా పూర్తి స్థాయి హిందీ సినిమాను ప్రియాంక చోప్రా సైన్ చేసిందే లేదు. దాంతో ప్రియాంక చోప్రా అభిమానులు తీవ్ర నిరాశ లో ఉన్నారు. మళ్లీ ఎప్పుడు పీసీ హిందీ సినిమాను చూస్తామో అంటూ ఆమె ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో ఆమె హిందీ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అయిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక చోప్రా హిందీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా సంజయ్ లీలా భన్సాలీ వంటి బడా దర్శకుడి దర్శకత్వంలో ఆమె సినిమా ఉండబోతుంది.
గత రెండు మూడు సంవత్సరాల్లో ఆమె వద్దకు ఎన్నో హిందీ సినిమా ఆఫర్లు వెళ్లాయట. కానీ వాటిని ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ చెప్పిన పెద్ద సినిమా కథ మరియు ఇతర విషయాలు నచ్చడంతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ నుంచి దిగి వచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రాబోతున్న ప్రాజెక్ట్ సినిమా నా లేదా వెబ్ సిరీస్ అయ్యి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పూర్తి విషయాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.