స్టార్ హీరో నటవారసురాలు బరిలోకి?
కానీ ఇప్పుడు వారి ఊహకు భిన్నమైన సమాధానం దేవగన్ నుంచి వచ్చింది. కరణ్ చాట్ షో `కాఫీ విత్ కరణ్ 8` తాజా ఎపిసోడ్‌లో చిరకాల స్నేహితులు అజయ్ దేవగన్ -రోహిత్ శెట్టి ప్రత్యక్షమయ్యారు.
బాలీవుడ్ లో వరుసగా నటవారసులు తెరకు పరిచయం అవుతున్నారు. ఇటీవలే ది ఆర్చీస్ సిరీస్ తో కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇంతలోనే ఇప్పుడు అజయ్ దేవగన్- కాజోల్ దంపతుల నటవారసురాలు నైసా దేవగన్ బాలీవుడ్ ఆరంగేట్రం గురించి హిందీ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సెలబ్రిటీ పార్టీల్లో నిరంతర చర్చల్లో నిలుస్తున్న నైసా బరిలోకి వచ్చేస్తోందని యూత్ లోను ముచ్చట సాగుతోంది.
కానీ ఇప్పుడు వారి ఊహకు భిన్నమైన సమాధానం దేవగన్ నుంచి వచ్చింది. కరణ్ చాట్ షో `కాఫీ విత్ కరణ్ 8` తాజా ఎపిసోడ్‌లో చిరకాల స్నేహితులు అజయ్ దేవగన్ -రోహిత్ శెట్టి ప్రత్యక్షమయ్యారు. అజయ్, రోహిత్‌లు దాదాపు 33 ఏళ్లుగా స్నేహితులు. ఇప్పుడు వారు తమ పిల్లలు తమ బాలీవుడ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. అయితే నైసా ఆరంగేట్రం గురించి దేవగన్ షాకిచ్చే విషయం చెప్పారు. తన కూతురు నైసాకు ఇప్పట్లో సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన లేదని అజయ్ దేవగన్ అన్నారు. ``ప్రస్తుతం ఆమె నట ప్రపంచంలోకి రావాలని కోరుకోవడం లేదు. ఆమె అలా ఉండాలని నేను అనుకోను.. కానీ రేపు ఏదైనా మారితే చూద్దాం`` అని అజయ్ దేవగన్ అన్నారు. ప్రస్తుతం సున్నా శాతం అవకాశం మాత్రమే ఉంది అని దేవగన్ చెప్పాడు.
అయితే తన కొడుకు ఇషాన్ సినిమాల్లో నటించాలనే తపనతో ఉన్నాడని రోహిత్ శెట్టి వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ, ``నా కుమారుడు సినిమాల్లో నటుడిగా ఉండాలనుకుంటున్నాడు. అతడు నటనపై మక్కువ ఏర్పరచుకున్నాడు. అయితే వాడు మొత్తం ఫార్మాట్‌లో వెళ్ళాలి. సినీరంగంలో పోరాటాన్ని ఎదుర్కొని చివరిగా నా కార్యాలయానికి చేరుకోవాలి`` అని శెట్టి అన్నారు. అయితే రోహిత్ శెట్టి, అతని కొడుకు, అతడి భార్య ఎందుకు ప్రైవేట్‌గా ఉంటారు? అని కరణ్ ప్రశ్నించారు. ప్రజలు వారిని ఎందుకు చూడలేదు అని ప్రశ్నించగా, శెట్టి ఇలా అన్నాడు, ``మంచి విషయాలు దాచిపెట్టాలి… మేము అలాగే ఉన్నాము. నా జీవితంలో ఎప్పుడూ పార్టీ పెట్టలేదు. నేను చాలా అరుదుగా పార్టీలకు వెళ్తాను`` అని అన్నారు. అజయ్ దేవగన్ మాట్లాడుతూ ``మనం చాలా నిరాడంబరమైన నేపథ్యాల నుండి వచ్చి చిన్న స్థాయి నుండి ప్రారంభించినప్పుడు కుటుంబ విలువలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. నేటికీ మనం ఎవరైనప్పటికీ మధ్యతరగతి వాళ్లమే. ఇంట్లో మేం పూర్తిగా మధ్యతరగతి వాళ్లం. మా నమ్మకాలు, ప్రతిదీ మధ్యతరగతి తరహాలోనే ఉంటాయి`` అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అజయ్ దేవగన్ త్వరలో రోహిత్ శెట్టి `సింగం ఎగైన్`లో కనిపించనున్నాడు. కాప్-చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్‌లను అతిథి పాత్రల్లో నటిస్తారు. కరీనా కపూర్ ఖాన్ అవ్నీ పాత్రలో మళ్లీ నటించనుంది. దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్ కూడా ఈ సినిమాలో పోలీసులుగా పరిచయం కానున్నారు.