సంతూర్ మమ్మీతో విశ్వక్ సేన్ రొమాన్స్!

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ ప్రకటనలోని సంతూర్ మమ్మీ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

Update: 2024-07-03 12:08 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంతూర్ సోప్ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండియా Vs ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో, రోహిత్ శర్మ సిక్స్ కొట్టిన బంతిని ఓ అందమైన యువతి క్యాచ్ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న మహేష్ ఆమెని అలా తీక్షణంగా చూస్తుండగా.. "దొరికింది, మన కొత్త సినిమాకి కాలేజ్ స్టూడెంట్'' అని పక్కనున్న అమ్మాయి అంటుంది. ఆ వెంటనే 'షి ఈజ్ బ్యూటిఫుల్' అంటూ మహేశ్ క్లాప్స్ కొడుతూ ఆమె దగ్గరకు వెళ్ళి, 'మీరు మా సినిమాలో..' అని ఏదో అడగబోతుంటాడు. అప్పుడు ఓ పాప పరుగెత్తుకుంటూ వచ్చి 'మమ్మీ' అంటూ ఆమెను హత్తుకుంటుంది. 'మమ్మీ?' అంటూ మహేష్ తో పాటుగా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. ఈ యాడ్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ ప్రకటనలోని సంతూర్ మమ్మీ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

సంతూర్ యాడ్ లో మహేష్ బాబుతో పాటుగా యాక్ట్ చేసిన ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష శర్మ. ఆమె ఒక మోడల్, నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. హర్యానాకు చెందిన ఈ బ్యూటీ.. క్యాడ్‌బరీ, సంతూర్ వంటి పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ కమర్షియల్ యాడ్స్ చేసింది. మహేష్ తో పాటుగా కార్తీ, వరుణ్ దావన్ వంటి హీరోలతో వాణిజ్య ప్రకటనల్లో నటించి, ఎంటర్టైన్మెంట్ టీవీ వరల్డ్ లో తనదైన ముద్ర వేసుకుంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది.

Read more!

2020లో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఆకాంక్ష శర్మ నటించిన 'ఐ యామ్ డిస్కో డాన్సర్ 2.0' అనే మ్యూజిక్ వీడియో సూపర్ హిట్టయింది. ఆ తర్వాత టైగర్ తో కలిసి చేసిన 'కాసనోవా' వీడియో సాంగ్ కూడా అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బాద్షా, నిఖితా గాంధీల 'జుగ్ను' మ్యూజిక్ వీడియోతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. దర్శన్ రావల్ తో దో దిన్, హార్డీ సంధుతో సైకో వంటి మరికొన్ని ఆల్బమ్స్ లో నటించింది ఆకాంక్ష. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

2022లో 'త్రివిక్రమ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది అందాల ఆకాంక్ష శర్మ. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. దీంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని టీవీ సిరీస్ లలో నటించే అందుకుంది. అయితే ఈ బ్యూటీ దాదాపు రెండేళ్ల తర్వాత ఓ క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. 'లైలా' మూవీలో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లైలా'. ఇందులో మాస్ కా దాస్ అమ్మాయిగా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా పరిచయం అవుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈరోజు గురువారం ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసిన మేకర్స్.. ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఇదొక విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతోంది. దీంట్లో హీరోయిన్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యముందని సమాచారం. మరి ఇన్నాళ్ళూ సంతూర్ మమ్మీగా పాపులర్ అయిన ఆకాంక్ష.. నటిగా టాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News

eac