1000 కోట్ల ఆనందంతో బన్నీ విజయయాత్ర
పుష్ప 2: ది రూల్ భారీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ట్రెండ్ అవుతున్నారు.
పుష్ప 2: ది రూల్ భారీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ట్రెండ్ అవుతున్నారు. ఊహించని విజయంతో ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు. విడుదలకు ముందు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచార యాత్రలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న బన్నీ, ఇప్పుడు సినిమా సక్సెస్ తర్వాత మరోసారి అభిమానులను కలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం బన్నీ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన రికార్డ్ క్రియేట్ చేసింది.
సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ప్రయాణం ప్రారంభించారు. ముంబై, బీహార్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో జరిగిన ఈవెంట్లలో బన్నీకి అభిమానుల నుంచి వచ్చిన స్పందన ఆయనకు మరింత స్ఫూర్తిని ఇచ్చింది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను ప్రమోషన్ల ద్వారా మరింత పెంచడంతో, సినిమా మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు, సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని పెంచుతోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పుష్ప 2: ది రూల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. ఇది కేవలం అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ హిట్‌గా నిలిచింది. అలాంటి విజయాన్ని తన పేరు మీద సొంతం చేసుకోవడం అల్లు అర్జున్‌కు గర్వకారణంగా మారింది. సినిమా సాధించిన ఈ ఘనతపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆనందాన్ని షేర్ చేసుకున్నారు
ఈ విజయం కోసం తనను ఆదరించిన అభిమానులకు, మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనే సంకల్పంతో అల్లు అర్జున్ మరో విజయయాత్ర ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం దేశంలోని ప్రధాన నగరాలను సందర్శించి, సక్సెస్ మీట్‌లను నిర్వహించాలని బన్నీ నిర్ణయించుకున్నారు. ఈ టూర్‌లో అభిమానులను వ్యక్తిగతంగా కలుసుకుని, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలపబోతున్నారు.
ఈ విజయయాత్రకు చివరగా హైదరాబాదులో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈవెంట్ గురించి ఇప్పటికే అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. పుష్ప 2 సక్సెస్ ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచేలా ఈ కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తోంది. నమ్మిన చిత్రంతో తగిన కష్టానికి ఈ స్థాయి రివార్డులు రావడం గర్వకారణం మాత్రమే కాదు, టాలీవుడ్ స్టాండర్డ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. ఈ విజయంతో అల్లు అర్జున్ తనెంటో మళ్ళీ నిరూపించుకున్నారు.