చిరు దేవుని గదిలో అల్లు లెజెండ్ ఫొటో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి విష్ చేయడం ఎలాంటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి విష్ చేయడం ఎలాంటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఒకే ఒక్క ట్వీట్ చేసి.. వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం.. మెగా ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పోస్టులే కనిపించాయి.
ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు.. ట్వీట్ పెట్టి డిలీట్ చేయడం, ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసి మళ్లీ రావడం తెలిసిందే. అయితే పవన్ గెలిచాక బన్నీ ట్వీట్ చేయలేదు. విష్ కూడా చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత ఫైరయ్యారు. కానీ కొన్ని రోజుల పాటు ట్రోల్స్ కాస్త తగ్గాయి. ఇటీవల అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల తర్వాత మళ్లీ పెరిగాయి. నచ్చితే వస్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో మెగా అభిమానులు.. అల్లు ఫ్యామిలీ మెంబర్స్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. బన్నీతో పాటు అల్లు అరవింద్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పిక్ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఉపాసన చేతిలో క్లీంకార ఉండగా.. చెర్రీ చేతిలో పెట్ డాగ్ ఉంది.
అయితే కృష్ణయ్యను చక్కగా అలరించుకుని పూజ చేసుకున్నారు. ఆయన ముందు అనేక నైవేద్యాలు సమర్పించారు. అదే సమయంలో దేవుని మందిరంలో పలు దేవుళ్ళ ఫోటోలతో పాటు ఇద్దరు వ్యక్తుల చిత్రపటాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఫోటోలు చిరంజీవి దేవుని మందిరంలో దర్శనమిచ్చాయి.
అంటే రోజూ.. చిరు ఫ్యామిలీ మెంబర్స్.. వారిద్దరిని కూడా పూజిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. వారంతా ఒకే ఫ్యామిలీ అని క్లియర్ గా అర్థమవుతోందని నెటిజన్లు చెబుతున్నారు. ఇటీవల చిరు బర్త్ డేకి బన్నీ విష్ చేయడం, ఆ తర్వాత మెగాస్టార్ కూడా రిప్లై ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అభిమానులే అనవసరంగా కామెంట్స్ చేసుకుంటున్నారని, వారంతా ఒకే కుటుంబమని చెబుతున్నారు. మరి ఇప్పటికైనా అల్లు ఫ్యామిలీపై ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి.