ఎంజీఆర్ లా ప్రజల గురించే ఆలోచిస్తారు!
ఏఎం రత్నం మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని లెజెండరీ కథానాయకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో పోల్చారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన స్నేహితుడు ఏ.ఎం.రత్నంతో కలిసి పలు తెలుగు చిత్రాలకు పని చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించింది ఏ.ఎం.రత్నం. ఇటీవల పవన్ కల్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'హరిహరవీరమల్లు' కోసం అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించారు. ఈ జోడీ మునుముందు కలిసి పని చేయనున్నారు.
తాజాగా బ్రో ఈవెంట్లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని లెజెండరీ కథానాయకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో పోల్చారు. ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. నేను 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూస్తున్నాను.
ఆయనలో నేనొక ఎంజీఆర్ గారిని చూశాను. ఎంజీఆర్ గారు ప్రతి సినిమాలో పాటల్లో గానీ మాటల్లో గానీ ప్రజలకు ఉపయోగపడే పదాలు రాయిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నా సినిమాల్లో అలాంటి ప్రయత్నం చేశారని అన్నారు.
ఖుషి షూటింగ్ చేసేప్పుడు.. సందేశంతో కూడుకున్న హిందీ పాటను పెడదామని సూచించినది పవన్ కల్యాణ్ గారు. నా మొదటిసారి తెలుగు సినిమాలో హిందీ పాట అయినా ఏమాత్రం వెనకాడకుండా పెట్టాం. ఆ పాటలో అద్భుతమైన సందేశం ఉంటుంది.
ఒక ప్రేమకథలో కూడా సందేశం ఇవ్వాలని ఆరోజుల్లోనే ఆయన ఆలోచించారు. ఎంజీఆర్ లా సినిమా ద్వారా ప్రజలకు మంచి చెప్పాలనుకునే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్... అని వ్యాఖ్యానించారు.
మా సేనాని పవన్ కళ్యాణ్ .. సాయి ధరమ్ తేజ్ .. త్రివిక్రమ్ ఈ చిత్ర బృందమంతా నాకు కుటుంబసభ్యులు లాంటివారని బ్రో చిత్రం ఘన విజయం సాధించాలని అత్తారింటికి దారేది నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఆకాంక్షించారు. బ్రో ఈవెంట్లో చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.