దేవరకొండ బ్రదర్.. కాస్త జాగ్రత్తగానే..
దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నకంటే కాస్త భిన్నమైన దారిలో వెళుతున్నాడు.
దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నకంటే కాస్త భిన్నమైన దారిలో వెళుతున్నాడు. ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆనంద్ తరువాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’, ‘హైవే’, ‘బేబీ’, ‘గంగం గణేశా’ సినిమాలు చేశాడు. వీటిలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అతనికి క్లాసిక్ హిట్ ఇచ్చింది. తరువాత ‘బేబీ’ మూవీ అయితే కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించింది.
ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండకి కూడా మంచి ఇమేజ్ వచ్చింది. ‘బేబీ’ తర్వాత ఈ ఏడాది ‘గంగం గణేశా’ అనే సినిమాతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రస్తుతం ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యతోనే ఆనంద్ దేవరకొండ ‘డ్యూయెట్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగానే మరో ఇద్దరు దర్శకులతో మూవీస్ ని ఆనంద్ లైన్ లో పెట్టేసాడు.
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో తనకి హిట్ ఇచ్చిన వినోద్ ఆనంతోజుతో ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేశారు. వినోద్ ఆనంతోజు మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఓటీటీలో ‘90s’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తో ఆనంద్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇది ప్రీప్రొడక్షన్ దశలో ఉందని తెలుస్తోంది. ఈ రెండు కూడా యూత్ ఫుల్ కాన్సెప్ట్ లతోనే ఉండబోతున్నాయని సమాచారం.
విదేశాలలో చదువుకొని అక్కడే స్థిరపడాలని అనుకునే యువకుడి కథతో ఆదిత్య హాసన్ సినిమా ఉంటుందంట. కచ్చితంగా వెబ్ సిరీస్ తరహాలోనే ఈ సినిమాతో కూడా ఆదిత్య హాసన్ మెప్పిస్తాడని అనుకుంటున్నారు. మొత్తానికి ఆనంద్ దేవరకొండ తన కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడని అర్ధమవుతోంది. తన ఇమేజ్ కి సరిపోయే కథలని ఎంపిక చేసుకొని మూవీస్ చేయడం ద్వారా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నాడు.
మెల్లగా ఇమేజ్ పెంచుకుంటే తరువాత కమర్షియల్ హీరోగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఈ ఇద్దరు దర్శకులతో కలిపి మొత్తం ఆనంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు హిట్ అయితే అతని మార్కెట్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పొచ్చు.