కమిట్‌మెంట్‌ ప్రశ్నతో ఆనందం అంతా పోయింది: అనన్య నాగళ్ల

ఈ విషయంలో తనకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం హ్యాపీగా అనిపించిందని అనన్య చెప్పింది.

Update: 2024-10-22 16:23 GMT

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్‌’. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనన్య వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమెకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నారా? అని ఓ మహిళా జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు అనన్య చాలా ఇబ్బంది పడింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఒక్క ప్రశ్నతో ఆనందం లేకుండా చేశారని తెలిపింది. ఈ విషయంలో తనకు మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడం హ్యాపీగా అనిపించిందని అనన్య చెప్పింది.

''అలాంటి ప్రశ్న వేసి తమను తాము అవమానించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాలకు రిలేటెడ్ గా ఉండే ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నారు. ఏంటి.. అంత డైరెక్ట్‌గా అలాంటి ప్రశ్న అడిగారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నాను. యాక్టింగ్ అనేది నా డ్రీం. 5 ఏళ్ళ నుంచి నేను ఇంట్లో ఫైట్‌ చేసి మరీ బయటకు వస్తున్నాను. ప్రతిరోజూ ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు మా అమ్మ ముఖంలో ఓ టెన్షన్ ఉంటుంది. ఓకే ఏం కాదమ్మా అని చెప్పే ఫీలింగ్ నా ముఖంలో ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు, నేను ఇండస్ట్రీకొచ్చి కుటుంబం పరువు తీసేశాననే ఫీలింగ్ లోనే ఇప్పటికీ నా బంధువులు ఉంటారు.''

''కానీ ‘పొట్టేల్‌’ సినిమా చూసిన తర్వాత మా అమ్మ, నా బ్రదర్ గర్వంగా ఫీలవుతూ ‘ఇంత గొప్ప సినిమాలో మా అమ్మాయి నటించింది.. మంచి సక్సెస్ వచ్చింది’ అని హ్యాపీగా అందరితో చెబుతారని అనుకున్నాను. ఒక వారంలో మా ఫ్యామిలీలో అందరూ నాకు సక్సెస్ వచ్చిందని గర్వపడతారని అనుకున్నా. అలాంటి టైంలో ఆ ప్రశ్న అడగడం వల్ల, ఇప్పుడు నాకు సక్సెస్‌ వచ్చినా.. ఈ అమ్మాయి ఇలా చేసి అక్కడిదాకా వెళ్ళింది కాబట్టే సక్సెస్ వచ్చిందని అందరూ అనుకుంటారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఫోన్లు చేసి మా అమ్మను ఇదే అడుగుతారు. నా బ్రదర్ పెళ్లి ఉంది, కచ్చితంగా మా అమ్మతో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇదే విషయం మీద మాట్లాడతారు. ఇన్నేళ్ల కష్టం తర్వాత మా అమ్మను ప్రౌడ్ గా చూడాలనుకునే హ్యాపీ మూమెంట్ వస్తే.. ఆమె అడిగిన ఒక్క ప్రశ్నతో అంతా పోయింది. ఆమె అడిగినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? అనే ఫీలింగ్ మాత్రమే వచ్చింది. కానీ నైట్ ఇంటికి వెళ్లి పడుకున్న తర్వాత దీని గురించి చాలా ఆలోచించాను” అని అనన్య నాగళ్ళ తెలిపింది.

అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు ఫోన్ చేసి అందరూ తనను తమ ఇంటి అమ్మాయిగా ఫీల్ అయి మాట్లాడారని, నువ్వు ఇండస్ట్రీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నావని అన్నారని అనన్య చెప్పింది. నీకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటామని, ఆమె అలా అడిగినందుకు సారీ చెప్పారని తెలిపింది. ''మీడియా మిత్రులు మాట్లాడిన తర్వాత ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తెచ్చుకున్నాను.. చూసే వాళ్ళు ఏమనుకున్నా మనం ఏం చేయలేం కదా అని పాజిటివ్ గా తీసుకొని మళ్ళీ 'పొట్టేల్' ప్రమోషన్స్ స్టార్ట్ చేశాను'' అని అనన్య నాగళ్ళ చెప్పింది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, ఈ చిత్రంలో నటించినందుకు నా కంటే ఎక్కువగా మా అమ్మ గర్వంగా ఫీలవుతుందని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News