ఐఫా 2024 వేదిక‌పై `యానిమ‌ల్` రాకింగ్

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2024 వేడుక‌ల్లో రెండవ రోజు అబుదాబిలో వైభ‌వంగా ముగిసాయి.

Update: 2024-09-29 10:09 GMT

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2024 వేడుక‌ల్లో రెండవ రోజు అబుదాబిలో వైభ‌వంగా ముగిసాయి. ఈ వేడుక‌లో సూప‌ర్ స్టార్లు కొలువు దీరారు. మొద‌టి రోజు సౌత్ సినిమాకి పుర‌స్కారాలు అందించ‌గా, రెండో రోజు బాలీవుడ్ చిత్ర‌సీమ‌కు పుర‌స్కారాలు అంద‌జేసారు. షారూఖ్ ఖాన్, రాణి ముఖ‌ర్జీ ఈ వేదిక‌పై ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారాలు ద‌క్కించుకోగా, తెలుగోడు సందీప్ వంగా `యానిమ‌ల్` కోసం ఐదు పుర‌స్కారాలు ద‌క్కించుకున్నాడు. యానిమ‌ల్ ఉత్త‌మ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. సందీప్ వంగా `యానిమ‌ల్` చిత్రం ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌డ‌మే గాక‌, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు, ఉత్త‌మ విల‌న్, ఉత్త‌మ సంగీతం, ఉత్తమ నేప‌థ్య గానం విభాగాల్లో పుర‌స్కారాల‌ను గెలుచుకుని టాప‌ర్ గా నిలిచింది. కింగ్ కొలువు దీరిన చోట సందీప్ వంగా రాక్ స్టార్‌లాగా మెరిసాడు. కింగ్ ఖాన్ హోస్టింగ్ చేస్తుండ‌గా, అత‌డు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈ వేడుక ఆద్యంతం సంద‌డే సంద‌డి. ఐఫా ఉత్స‌వాల‌ రెండో రోజు వేదిక‌పై షారూఖ్ స‌హా ప‌లువురు అగ్ర తార‌లు సంద‌డి చేసారు. హేమమాలిని, రేఖ, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, బాబీ డియోల్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, కృతి సనన్ వంటి ప్రముఖులతో సహా బాలీవుడ్‌లోని దిగ్గ‌జాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అవార్డుల వేడుక‌లో షారుఖ్ ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈవెంట్‌ను హోస్ట్ చేయడమే కాకుండా తన సిగ్నేచర్ లుక్స్ తో, చేష్ఠ‌ల‌తో ఆక‌ర్షించాడు ఖాన్. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించారు. వేదికపై అతడితో కలిసి విక్కీ కౌశల్ , కరణ్ జోహార్ బోలెడంత ఫ‌న్ పండించారు. షారూఖ్ హిట్ పాట `ఝూమే జో పఠాన్`లో అద్భుత‌ ప్రదర్శన ఇచ్చారు. తారలు తమ డ్యాన్స్‌లతో స్టేజ్‌ని ఉర్రూత‌లూగించారు. ఈ వేదిక‌పై విజేతల ప్రకటనతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

IIFA 2024 విజేతల పూర్తి జాబితా

1. ఉత్తమ చిత్రం- యానిమ‌ల్ (భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా)

2.ఉత్త‌మ ద‌ర్శ‌కుడు-విధు వినోద్ చోప్రా-12వ ఫెయిల్

3. ప్రధాన పాత్రలో ఉత్త‌మ న‌టి- రాణి ముఖర్జీ- శ్రీమతి ఛటర్జీ వ‌ర్సెస్ నార్వే

4. ప్రధాన పాత్రలో ఉత్త‌మ న‌టుడు (పురుషుడు) - షారూఖ్ ఖాన్-జవాన్

5. సపోర్టింగ్ రోల్ (ఫీమేల్) - షబానా అజ్మీ - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ

6. సపోర్టింగ్ రోల్ (పురుషుడు)- అనిల్ కపూర్- యానిమ‌ల్.

7. ఉత్త‌మ విల‌న్ - బాబీ డియోల్-యానిమల్

8. ఉత్త‌మ‌ సంగీతం- ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్-యానిమల్

9. ఉత్త‌మ‌ నేపథ్య గాయకుడు (పురుషుడు) భూపిందర్ బబ్బల్- అర్జన్ వైలీ-యానిమల్

10. ప్లేబ్యాక్ సింగర్ (మహిళ) శిల్పారావ్- చలేయ-జవాన్

ఈ మూడు రోజుల వేడుక సెప్టెంబర్ 27న IIFA ఉత్సవంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలు- తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ రంగాల‌కు అంకితం అయిన‌ది. ఉత్త‌రాదిన ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు అవార్డులు అందించారు.

Tags:    

Similar News