'బ్రహ్మాస్త్ర 2'పై 'యానిమల్' ఎఫెక్ట్
కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ సెట్స్ కెళుతుందా లేదా? ఉంటుందా ఉండదా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి
రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్టు ప్రచారమైంది. కానీ ఇది యావరేజ్ హిట్. ఈ సినిమా తర్వాత వెంటనే తూ జీతూ.. సినిమాతో రణబీర్ మరో హిట్టందుకున్నాడు. ఇప్పుడు యానిమల్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఇంకా బ్రహ్మాస్త్ర సీక్వెల్ గురించి మాట లేదు. నిర్మాత కరణ్ జోహార్ దీనిపై ఇంతవరకూ పెదవి విప్పలేదు. నిజానికి బ్రహ్మాస్త్ర విడుదల సమయంలో దీనిపై బోలెడంత హంగామా నడిచింది.
కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ సెట్స్ కెళుతుందా లేదా? ఉంటుందా ఉండదా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కరణ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. అంతేకాదు బ్రహ్మాస్త్ర 2 భారీ మల్టీస్టారర్ గా చిత్రీకరించాల్సి ఉంటుంది. కథ డిమాండ్ మేరకు రణబీర్ తో పాటు ఇందులో రెండో పెద్ద హీరో నటించాల్సి ఉంటుంది. కానీ అలా రెండో హీరో కూడా యాడయితే బడ్జెట్ అదుపు తప్పుతుందని ఆలోచిస్తున్నారట. రెండో హీరోగా రణవీర్ ని తీసుకునే ఆలోచన ఉందని కూడా కథనాలొచ్చాయి.
బ్రహ్మాస్త్ర 2 ఆలస్యమవ్వడానికి `యానిమల్` ఎఫెక్ట్ కూడా ఉందని అంటున్నారు. రణబీర్ ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ ని అందుకున్నాడు. దానికి తగ్గట్టు భారీ పారితోషికం పెంచేసాడు. సుమారు 60 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నాడనేది టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, రణబీర్ తో పాటు నటించే పెద్ద హీరో కూడా 60కోట్లు డిమాండ్ చేసే వీలుంటుంది. దీంతో బడ్జెట్ మరింత పెద్దదవుతుంది. ఇక బ్రహ్మాస్త్ర త్రయం అంతా భారీ వీఎఫ్ ఎక్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి 500 కోట్ల లోపు బడ్జెట్ సరిపోదు. ఇది ఆర్.ఆర్.ఆర్ కంటే ఎక్కువ బడ్జెట్ ని కోరుతుంది. అంటే `బ్రహ్మాస్త్ర 2`ని ఇద్దరు పెద్ద స్టార్లతో నిర్మిస్తే బడ్జెట్ సుమారు 600 కోట్లు పైగా అవుతుంది. అంత పెద్ద బడ్జెట్ పెడితే ఆర్.ఆర్.ఆర్ లేదా పఠాన్ తరహాలో 1000 కోట్లు అంతకుమించి వసూలు చేస్తేనే వర్కవుటవుతుంది. అలా కాకుండా ఫెయిలైతే నిర్మాత నిండా మునిగిపోతాడు. అందుకే కరణ్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బ్రహ్మాస్త్ర 2 చిత్రం 2026లోపు సెట్స్ కెళ్లే అవకాశం లేదని కూడా ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం వెలువరించింది. అయితే ఇది అధికారిక సమాచారం కదు. ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే.