కొత్త ఇన్నింగ్స్‌కి సిద్దమవుతున్న పీసీ

ఇటీవల 'చంకీలా' సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు పరిణీతి చోప్రా వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్‌ను స్కిప్‌ చేసిన మేకర్స్ నేరుగా ఓటీటీ ద్వారా చంకీలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Update: 2025-02-26 16:30 GMT

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఆ సినిమా కాకుండా మరే ఇండియన్‌ మూవీస్‌లోనూ ఈ అమ్మడు నటించడం లేదు. హాలీవుడ్‌లో ఈమె సినిమాలతో పాటు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తుంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్ సిటాడెల్‌కి మంచి స్పందన వచ్చింది. దాంతో ప్రియాంక చోప్రా మరిన్ని వెబ్‌ సిరీస్‌లను చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా దారిలోనే ఆమె కజిన్‌ పరిణీతి చోప్రా (పీసీ) సైతం వెబ్‌ కంటెంట్‌లో అరంగేట్రంకి సిద్ధం అవుతుంది.

ఇటీవల 'చంకీలా' సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు పరిణీతి చోప్రా వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్‌ను స్కిప్‌ చేసిన మేకర్స్ నేరుగా ఓటీటీ ద్వారా చంకీలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన అమర్ సింగ్ చంకీలా సినిమా నెట్‌ ఫ్లిక్స్‌లో సెన్షేషల్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ముందు ముందు మరిన్ని వెబ్‌ కంటెంట్‌లో నటించాలనే ఉద్దేశంతో పరిణీతి చోప్రా ఉందని తెలుస్తోంది. అందుకే ఇటీవల సోను రజ్జాన్‌, జెన్నిఫర్‌ వింగెట్‌లతో ఒక మిస్టరీ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సిద్ధం అయింది.

పరిణీతి చోప్రా బాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయింది. ఈమెతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు టాప్‌ స్టార్‌ హీరోయిన్స్‌గా పేరు దక్కించుకున్నారు. కానీ ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. స్టార్‌ హీరోయిన్‌లతో పోటీలో ఈమె వెనుక పడింది. పెద్ద సినిమాల్లో ఈమెకు ఆఫర్లు దక్కలేదు. చేసిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోలేదు. దాంతో అమర్ సింగ్‌ చంకీలా ప్రాజెక్ట్‌తో ఓటీటీలో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఓటీటీలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అందుకే వెండి తెరపై దక్కని గుర్తింపును ఓటీటీ ద్వారా ఈ అమ్మడు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది.

అమర్‌ సింగ్‌ చంకీలా సినిమాతో వచ్చిన ఓటీటీ గుర్తింపును సద్వినియోగం చేసుకోవడం కోసం వెంటనే వెబ్‌ సిరీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లో పరిణీతి చోప్రాతో పాటు హర్లీన్‌ సేథి, తాహిర్ రాజ్‌ భాసిన్‌, అనుప్‌ సోని, సుమీత్‌ వ్యాస్‌, చైతన్య చౌదరి వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌పై పరిణీతి చాలా ఆశలు పెట్టుకుంది. వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ మూవీస్‌తో ఆకట్టుకుని ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించి వెండి తెరపై స్టార్‌డం దక్కించుకోవాలని ఈ అమ్మడు ఆశ పడుతోంది. మరి పరిణీతి చోప్రా కొత్త ఇన్నింగ్స్ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News