యానిమల్ ఫ్రాంఛైజీ అన్‌లిమిటెడ్ ట్రీట్?
ఇప్పటికే మూడు వారాల రన్ ని అందుకున్న యానిమల్ షోలు చాలా నగరాల్లో ఇప్పటికే తగ్గాయి.
ఎంతగా విమర్శలు చెలరేగితే అంత పెద్ద విజయం సాధ్యమని 'యానిమల్' నిరూపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 830 కోట్లు వసూలు చేసింది. అయితే డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ లాంటి భారీ క్రేజ్ ఉన్న చిత్రాలు విడుదలవుతుండడంతో ఇక యానిమల్ వసూళ్ల హవా ముగుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు వారాల రన్ ని అందుకున్న యానిమల్ షోలు చాలా నగరాల్లో ఇప్పటికే తగ్గాయి.
ఇంతలోనే సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ పార్క్ (పార్ట్ 2) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. యానిమల్ పార్ట్ 2 మాత్రమే కాకుండా యానిమల్ పార్ట్ 3 కోసం ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. యానిమల్ కథాంశంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇది పంజాబీ కుటుంబానికి చెందిన ఉక్కు వ్యాపారి కథ. ఉక్కు దిగ్గజ కంపెనీ స్వస్తిక్ ని అంతం చేయాలని చూసేది అన్నదమ్ములు, వారి పిల్లలు మాత్రమే. అందువల్ల ఈ కథలో వైరానికి రివెంజ్ తీర్చుకోవడానికి బోలెడంత స్కోప్ ఉంది. భారీ మెలోడ్రామాకు ఆస్కారం ఉంది. ఇందులోనే యాక్షన్ పగలు ప్రతీకారాలు చూడగలం.
ఇప్పుడు ఈ కీ- పాయింట్ ఆధారంగా సందీప్ వంగా తనదైన శైలిలో యానిమల్ ని ఫ్రాంఛైజీగా మార్చి బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాలని ప్రణాళికలు రచించారు. మొదటి భాగంలో అబ్రార్ పై ప్రతీకారం తీర్చుకున్న రణ్ విజయ్ ఇకపై వృద్ధుడిగా మారతాడు. అయితే అబ్రర్ సోదరుడు, కర్కశుడైన అజీజ్ (అచ్చం రణబీర్ లా కనిపిస్తాడు) కథేమిటన్నది `యానిమల్ పార్క్`లో చూపించనున్నారు. ఆ మేరకు పార్ట్ 1 ముగింపులో అజీజ్ పాత్రతో ట్విస్టిచ్చిన సంగతి తెలిసిందే. అజీజ్ అబ్రార్ కంటే ప్రమాదకారి అని, అతడు తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కసితో రగిలిపోతున్నాడని క్లైమాక్స్ లో చూపించారు. పార్ట్ 2లో మరింత హింస, రక్తపాతం తప్పదని ఆడియెన్ కి అర్థమైంది. అంతేకాదు పార్ట్ 2లో మరింతగా యాక్షన్ ఎపిసోడ్స్ తో రక్తి కట్టించే వీలుండడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అజీజ్ పాత్ర పరిచయం వ్యూహాత్మకం. సీక్వెల్ కథల్ని అభివృద్ధి చేసి వాటిని భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లుగా మలిచేందుకు ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి పార్ట్ 2 కోసం యానిమల్ పార్క్ లేదా యానిమల్ ఫామ్ అనే టైటిళ్లు వినిపిస్తున్నాయి. అయితే పార్ట్ 2లో స్వస్థిక్ కంపెనీ అధినేత బల్బీర్ సింగ్ వారసుడు రణ్ విజయ్ (రణబీర్) కి కూడా కొడుకు ఉన్నాడు. ఆ పాత్రను కూడా తిరిగి రేసులోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది? అన్నది కూడా భవిష్యత్ సినిమాలను నిర్ధేశిస్తుంది. కుటుంబంలో పగలు ప్రతీకారాలకు అంతూ దరీ ఉండదు. అవి వారసత్వంగాను అంటుకుంటాయి. అందువల్ల యానిమల్ ఫ్రాంఛైజీని టీవీ సిరీస్ లా ఎంత దూరమైనా పొడిగించేందుకు ఆస్కారం ఉందన్నది కాదనలేని నిజం.