'డాకు మహారాజ్‌' నెట్‌ఫ్లిక్స్‌ నెంబర్స్‌..!

ఇండియాలో ట్రెండ్‌ కావడం గొప్ప విషయం అనుకుంటే ఈ సినిమా 10కి పైగా దేశాల్లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Update: 2025-02-26 13:22 GMT

బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాల తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. డాకు మహారాజ్‌తో బాలకృష్ణ డబుల్‌ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ ట్రెండ్‌ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. గత రెండు వారాలుగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇండియాలో ట్రెండ్‌ కావడం గొప్ప విషయం అనుకుంటే ఈ సినిమా 10కి పైగా దేశాల్లో టాప్‌లో ట్రెండ్‌ అవుతుంది.

వరుసగా రెండో వారంలోనూ ఇండియా మొత్తం ట్రెండ్‌ అవుతున్న డాకు మహారాజ్ విదేశాల్లోనూ టాప్‌ 5 లో ట్రెండ్‌ అవుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 24 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది అంటూ నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక నెంబర్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమాకు 57 మిలియన్‌ అవర్స్‌ కి పైగా వ్యూవర్‌షిప్ దక్కిందట. సాధారణంగా బాలీవుడ్‌ సినిమాలు మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డ్‌లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ప్రభాస్ నటించిన సినిమాలు గతంలో ఈ స్థాయిలో వ్యూస్‌ నమోదు చేశాయని టాక్. కానీ సీనియర్ హీరో సినిమాకు ఈ స్థాయి స్పందన మొదటి సారి అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్‌కి ఓ రేంజ్‌లో స్పందన దక్కింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంలో తమన్‌ సంగీతం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా తమన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది అంటూ అంతా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఓటీటీలో షేక్‌ చేస్తున్న డాకు మహారాజ్ సినిమా రాబోయే రెండు మూడు వారాల వరకు టాప్‌లోనే ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విదేశాల్లోనూ ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి మేకర్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు.

జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణ కెరీర్‌ లో రూ.150 కోట్లు క్రాస్ చేసిన సినిమాగా నిలవడం మాత్రమే కాకుండా గత చిత్రాలను బీట్‌ చేసే విధంగా ప్రస్తుతం ఓటీటీలో టాప్‌ ట్రెండ్‌లో కొనసాగుతోంది. డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ నటించింది. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో పాటు ఐటెం సాంగ్‌లో ఆడి పాడింది. బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ ఈ సినిమాలో స్టైలిష్ విలన్‌గా నటించాడు.

Tags:    

Similar News