అనిరుద్ పాట వల్లే ఆ సినిమా ఫ్లాపా?
ఆ పాటకు పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ వచ్చినా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.
వై దిస్ కొలవరి కొలవరి కొలవరి డి.. ఈ పాట ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. అంతలా పాపులర్ అయిందీ సాంగ్. 2012లో విడుదలైన 3 సినిమాలోని పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. హీరో ధనుష్ పాడిన ఈ పాట.. ఏ వీధిలో చూసినా వినిపించేది. అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్.. ధనుష్ తోపాటు సినిమా దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ ను విందుకు పిలిచి మరో అభినందించారు. ధనుష్, శ్రుతి హాసన్ నటించిన ఈ మూవీతో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు.
ఆ పాటకు పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ వచ్చినా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఈ సాంగ్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ పాట తన 3 చిత్రాన్ని చంపేసిందని ఐశ్వర్యా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె డైరెక్ట్ చేసిన కొత్త మూవీ లాల్ సలాం రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘3 సినిమాను సీరియస్ లవ్ స్టోరీగా రూపొందించాలనుకున్నాను. దానిని వై దిస్ కొలవరి పాట మార్చేసింది. ఆ స్థాయి రెస్పాన్స్ మేం ఊహించలేదు. దీంతో సినిమా మేకింగ్ విషయంలో మాపై ఒత్తిడి పెరిగింది. సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ఆ పాట ఆ తర్వాత ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. అలా జరుగుతుందని నేను అప్పుడు ఊహించలేదు’’ అని చెప్పారు
‘‘అందుకు అంగీకరించడానికి కష్టంగా ఉన్నా. చాలా మంది వారి జీవితానికి ఆ పాటను ఆపాదించుకుంటూ ఆదరించారు. అందుకు సంతోషంగా ఉంది. మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఎవరూ స్పందించలేదు. రీరిలీజ్, టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేశారు. ఇప్పుడు అలా ఫోన్లు రావడానికి కారణం వై దిస్ కొలవెరి పాట చిత్రాన్ని మరుగున పడేయడమే’’ అని ఐశ్వర్య వ్యాఖ్యానించారు.
ఐశ్వర్య తాజాగా తన తండ్రి రజనీకాంత్ కీలక పాత్రలో లాల్ సలాం తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ శుక్రవారం తెరపైకి వచ్చింది. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.