37 ఏళ్ల వయసులో అచ్చ తెలుగందం జోరు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ''గేమ్ ఛేంజర్'' సినిమాలో అంజలి ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
అందాల భామ అంజలి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కోనసీమకు చెందిన ఈ పదహారణాల తెలుగందం.. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. 2006లో 'ఫొటో' అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ రాజోల్ బ్యూటీ.. కెరీర్ ప్రారంభం నుంచీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది కానీ, తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే చాన్నాళ్ల తర్వాత అమ్మడు ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ''గేమ్ ఛేంజర్'' సినిమాలో అంజలి ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో చెర్రీ రెండు పాత్రలు పోషిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి ఆమె జోడీగా కనిపించనుంది. ఓవైపు భార్యగా, మరోవైపు తల్లిగా ఎమోషన్ పంచించే అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఆమె చేస్తున్న మూవీ ఇది. భారీ స్ధాయిలో రూపొందే పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఇతర భాషల్లోనూ గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాలోనూ అంజలి నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అంజలి ఒక వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో ఆమె పోషించిన క్యారెక్టర్స్ కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఒక రకంగా ఇది ఎంతో ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా నటించే అంజలికి, ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టబోతోందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ''గీతాంజలి మళ్లీ వచ్చింది". 2014లో రిలీజైన 'గీతాంజలి' సినిమాకి ఇది సీక్వెల్. అంతేకాదు అంజలి కెరీర్ లో మైలురాయి 50వ చిత్రం. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సమ్మర్ కానుకగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఆమెకి మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇలా అంజలి ప్రస్తుతం తెలుగులో మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడూ క్యారెక్టర్ పరంగానూ, క్రేజ్ పరంగానూ ఆమె రేంజ్‌ను మరింత ఎత్తుకు చేర్చే అవకాశం వుంది. ఇవి కచ్ఛితంగా ఆమె ఫేట్‌ను మార్చేస్తాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అని అంటుంటారు. తమిళ మలయాళ కన్నడ సినిమాల్లో నటించిన అంజలి, రచ్చ గెలిచింది. ఇంట గెలవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ 37 ఏళ్ల తెలుగందం గేమ్ ఛేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాలతో హిట్లు కొట్టి టాలీవుడ్ లో సత్తా చాటుతుందేమో వేచి చూడాలి.