అక్కినేని నాగేశ్వర రావు పంచలోహ విగ్రహం రెడీ!
తన డెబ్బై ఐదేళ్ల కెరీర్ లో అనేక క్లాసిక్ చిత్రాలలో నటించిన నాగేశ్వర రావు.. భారతీయ సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త చరిత్ర సృష్టించిన నటుడు అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. తన డెబ్బై ఐదేళ్ల కెరీర్ లో అనేక క్లాసిక్ చిత్రాలలో నటించిన నాగేశ్వర రావు.. భారతీయ సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.
ఇదే సమయంలో నటుడిగానే కాకుండా.. స్టూడియో అధినేతగా, నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. ఇక, సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి వేడుక రాబోతుంది. ఈ సమయంలో జయంతిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అక్కినేని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
అవును... సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఆయన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖులు కూడా ఆహ్వానించారని తెలుస్తుంది.
కాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు వారి జీవితకాల విజయాలు, సేవలకు గుర్తింపుగా అక్కినేని కుటుంబం ఏటా ఏఎన్నార్ అవార్డుతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ఏఎన్నార్ పట్ల తమకున్న అభిమానాన్ని తెలియజేస్తూ.. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
1924 సెప్టెంబర్ 20న కృష్ణాజిల్లాలోని రామాపురంలో జన్మించారు అక్కినేని నాగేశ్వర రావు. చిన్ననాటి నుంచీ నాటకాలపై అసక్తి ఉన్న ఆయన... అనంతరం నాటకరంగం నుండి సినిమాల వైపు వచ్చారు. తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన సినిమాలు, పోషించిన పాత్రలు, అవి సృష్టించిన రికార్డులు గురించి ఎంత చెప్పినా తక్కువే. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు నటసామ్రాట్.