యంగ్ హీరోతో అగ్రనిర్మాత వైరం ముగిసినట్టే
అదే సమయంలో కార్తీక్ తో మరోసారి తన నిర్మాణ సంస్థ పని చేయబోదని కూడా కరణ్ జోహార్ ప్రకటించారు.
బాలీవుడ్ లో ఇన్ సైడర్- ఔట్ సైడర్ వార్ గురించి తెలిసిందే. ఔట్ సైడర్ గా సినీరంగంలో ప్రవేశించి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ప్రముఖ యువహీరో కార్తీక్ ఆర్యన్.. ఇన్ సైడర్లకు మాత్రమే అవకాశాలు కల్పించే కరణ్ జోహార్ దర్శకత్వంలో ఒక అవకాశం అందుకోవడం, ఆ తర్వాత మనస్ఫర్థల కారణంగా ఆ ఇద్దరూ దూరమవ్వడం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ -కరణ్ కాంబినేషన్ లో దోస్తానా 2 ప్రారంభమై కొంత చిత్రీకరణ జరిగాక మిడిల్ డ్రాప్ అయ్యారు. కార్తీక్ ప్రవర్తన సరిగా లేదని, ప్రొఫెషనల్ గా లేడని కరణ్ విమర్శించాడు. అదే సమయంలో కార్తీక్ తో మరోసారి తన నిర్మాణ సంస్థ పని చేయబోదని కూడా కరణ్ జోహార్ ప్రకటించారు.
ఈ ప్రకటనలతో కార్తీక్ తో వైరం ఇప్పట్లో తెగేది కాదని అంతా ఒక నిర్ధారణకొచ్చారు. కార్తీక్- కరణ్ ఎప్పటికీ కలిసి పని చేయరని కూడా భావించారు. కానీ పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. రాజకీయాల్లో, సినిమాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవని నిరూపణ అవుతోంది. గత కొంతకాలంగా కార్తీక్ ఆర్యన్ తో మళ్లీ కలిసి పని చేసేందుకు కరణ్ జోహార్ సముఖంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఈ జోడీ కలయికలో ఓ రొమాంటిక్ కామెడీ సినిమాని అధికారికంగా ప్రకటించడంతో ఇక వైరం ముగిసినట్టేనని భావిస్తున్నారు.
కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో ప్రామిస్సింగ్ హీరోగా మారాక అతడి చుట్టూ అగ్ర నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. భూల్ భులయా 3 ఘనవిజయం తర్వాత అతడు ఇప్పుడు అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్‌లతో కూడా పని చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో కరణ్ కూడా దిగి వచ్చి అతడితో సినిమాని ప్రకటించాడు. కార్తీక్ ఇప్పుడు అధికారికంగా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో కూడా చేరాడు. `తు మేరీ మెయిన్ తేరా, మెయిన్ తేరా తు మేరీ` పేరుతో కొత్త రోమ్ కామ్ చిత్రాలను ప్రకటించారు. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. వరుసగా రొమాంటిక్- కామెడీ చిత్రాలతో ఆ ఇద్దరూ తిరిగి కలుస్తున్నారు. దీంతో కార్తీక్ ఆర్యన్ - కరణ్ జోహార్ మధ్య వైరం ముగిసిందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తు మేరీ మెయిన్ తేరా, మెయిన్ తేరా తు మేరీ చిత్రాలను కరణ్ జోహార్ - అదర్ పూనావాలా నిర్మిస్తున్నారు. దీనికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.