బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడు రజనీ చిలిపి వేషాలు
1975లో తొలిసారి తెరపై కనిపించినప్పుడు అతడిలో ఉన్న అదే ఆకర్షణ 2025లో కూడా అలాగే ఉంది.;
భారతీయ చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ ని కొనసాగించిన స్టార్ రజనీకాంత్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 70 పైబడిన వయసులో తన కాలాతీత సూపర్‌స్టార్ హోదాను కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. 1975లో తొలిసారి తెరపై కనిపించినప్పుడు అతడిలో ఉన్న అదే ఆకర్షణ 2025లో కూడా అలాగే ఉంది.
అయితే ఇన్ని సంవత్సరాలు అతడు ప్రజాదరణ పొందడం వెనక అతడి విలక్షణ శైలి ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా అతడి స్టైల్ మాస్ లో అగ్గి రాజేస్తుంది. అతడి నడక.. నడత.. తీక్షణమైన చూపులు.. గాల్లో సిగరెట్ ఎగురవేసి పెదవితో అందుకునే ఇస్టయిల్.. కళ్లద్దాల్ని గాల్లో ఎగురవేసి ధరించే విధానం.. ప్రతిదీ ట్రేడ్ మార్క్ స్టైల్ గా మార్చారు రజనీ. వీటన్నిటినీ తెరపై వీక్షించేందుకు అతడి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తారు. తరతరాలుగా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన స్టైల్ కంటెంట్ ని ఆయన ఏనాడూ విడువలేదు.
2018లో నడిగర్ సంఘం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన సందర్భంగా రజనీకాంత్ తన ప్రత్యేక శైలి- స్టైల్ కంటెంట్ గురించి మాట్లాడారు. సినిమాల్లోకి రాకముందు తన తొలి రోజులను గుర్తుచేసుకుంటూ, బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసిన టైమ్ లో అమ్మాయిల ముందు ఎలా ఫోజ్ కొట్టేవాడో ఆయన గుర్తు చేసుకున్నారు. నిజానికి రజనీకాంత్ సిగ్నేచర్ స్టైల్, మూవ్ మెంట్స్, ఫ్యాషన్ స్కిల్ ఇవేవీ సినిమా సెట్‌లలో పుట్టలేదు. బస్ కండక్టర్ గా ఉన్నప్పుడు దైనందిన జీవితంలో సహజంగా పుట్టిన లక్షణాలు ఇవి. ఆయన స్క్రీన్ లెజెండ్‌గా మారడానికి చాలా కాలం ముందు నుంచే ఇవన్నీ పుట్టాయి.
రజనీ సహజంగానే, నేను స్టైలిష్ వ్యక్తిని అని బహిరంగంగా చెప్పారు. బస్ కండక్టర్‌గా ఉన్న రోజుల్లో ఫ్యాషన్ స్టైల్ విషయంలో స్కిల్ ని డెవలప్ చేసానని అన్నారు. సాధారణంగా ఒక కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది కానీ, తాను కేవలం 10 నిమిషాల్లోనే ఆ పని చేయగలనని, తన సహజ వేగం, సామర్థ్యం గురించి ప్రస్థావించారు. కానీ రజనీకాంత్‌ను ఇతరులకు భిన్నంగా వేరు చేసింది కేవలం ఈ చురుకుదనం మాత్రమే కాదు.. ఆయన సహజ శైలి.. ఆయన పనిచేసిన వాతావరణం నుండి ఇదంతా ఉద్భవించింది. ప్రభుత్వ బస్సులలో మేల్ ఫీమేల్ సీట్లు కీలక పాత్ర పోషించాయి. ఆ రోజుల్లో ఆడవాళ్లు ముందు వరుసలలో కూర్చునేవారు. కర్ణాటక బస్సులలో పురుషులు వెనుక వరుసలలో కూర్చునేవారు. సాధారణంగా కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడం ముగించి వెనుకే ఉండేవాడు. కానీ నేను ముందు భాగంలోనే నిలబడేవాడిని.. నా పొడవాటి జుట్టు బస్సు నుండి వచ్చే గాలి కారణంగా స్టైలిష్ గా ఎగురుతూ ఉండేది.. దానిని స్క్రీన్ పై ఐకానిక్ కదలికలలో ఒకదానిగా మార్చానని రజనీ తెలిపారు.
నాకు చాలా జుట్టు ఉండేది.. గాలి దాని గుండా దూసుకుపోయినప్పుడు అది వికృతంగా మారుతుంటే, వెంటనే నేను నా జుట్టును తిరిగి యథావిధంగా ఉండేలా తలను స్టైలిష్ గా తిప్పేవాడిని అని రజనీ చెప్పారు. ఇది సహజంగా వచ్చినది. తన సినిమా కెరీర్‌ను ప్రారంభించడానికి ముందే స్టైల్ కంటెంట్ అనేది అతడి వ్యక్తిత్వంలో అంతర్భాగం. రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు అసలు పేరు - శివాజీ రావ్ గైక్వాడ్. అతడు కన్నడిగ. లెజెండరీ దర్శకుడు బాలచందర్ అతడి పేరును రజనీకాంత్ గా మార్చారు. రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి అనే సినిమాలో నటిస్తున్నారు. తదుపరి జైలర్ 2 సహా పలు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నారు.