ద‌క్షిణాది సినిమాపై బాలీవుడ్ దిగ్గ‌జాల‌ మేథోమ‌ద‌నం

క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో బాలీవుడ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచాయి.;

Update: 2025-03-10 03:30 GMT

క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో బాలీవుడ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వ‌రుస‌గా అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వ‌ద్ద డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఆ త‌ర్వాత కూడా కోలుకునే ప‌రిస్థితి క‌నిపించడం లేదు. ఏడాది కాలంగా కేవ‌లం కొన్ని విజ‌యాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఇటీవ‌ల శ్ర‌ద్ధా క‌పూర్ - `స్త్రీ 2`, విక్కీ కౌశ‌ల్ `చావా` మంచి బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచి కొంత‌వ‌ర‌కూ ఆదుకున్నాయి కానీ, అగ్ర హీరోల సినిమాలేవీ అంత‌గా ఆడ‌లేదు.

అదే స‌మ‌యంలో సౌత్ నుంచి వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌చ్చాయి. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల‌ను మించి సౌత్ స్టార్లు వ‌సూలు చేస్తున్నారు. ఉత్త‌రాది బాక్సాఫీస్ వ‌ద్ద సౌత్ సినిమా హ‌వా సాగిస్తోంది. దీంతో బాలీవుడ్ దిగ్గ‌జాలంతా ఢీలా ప‌డిపోయారు. ప్ర‌స్తుతం సౌత్ సినిమా విజ‌యాల వెన‌క ఉన్న అస‌లు కార‌ణ‌మేమిటో మేధావులు విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు.

తాజాగా ప్ర‌ముఖ హీరో, నిర్మాత అమీర్ ఖాన్, దిగ్గ‌జ ర‌చ‌యిత‌ జావేద్ అక్తర్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమ పరిస్థితిపై మాట్లాడారు. దక్షిణాది సినిమా నుండి నేర్చుకోగల పాఠాల గురించి ఈ ఇద్ద‌రు దిగ్గ‌జాలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అమీర్ ఖాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భారతీయ సినీప‌రిశ్ర‌మ‌కు ఆయన చేసిన కృషిని సెల‌బ్రేట్ చేసుకునేందుకు పీవీఆర్‌-ఐనాక్స్ నిర్వహించిన `అమీర్ ఖాన్: సినిమా కా జాదుగర్` చలనచిత్రోత్సవ ప్రారంభోత్సవంలో వారు మాట్లాడారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. మ‌నం కూడా ద‌క్షిణాదిలా మ‌సాలా సినిమాపై దృష్టి సారించాల‌ని అన్నారు. కోపం, ప్రేమ, ప్రతీకారం వంటి భారీ స్ట్రోక్‌లపై బాలీవుడ్ దృష్టి పెట్టడం లేదు. మనం ద‌క్షిణాదిలాగా నమ్మకంతో సినిమాలు తీయాలి. సౌత్ సినిమాలను మనం సింగిల్ స్క్రీన్ సినిమాలు అని పిలిచేవాళ్ళం. చాలా మాస్.. చాలాకాలంగా పాతుకుపోయినవి. బహుశా బాలీవుడ్ మల్టీప్లెక్స్ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది! అని అమిర్ అన్నారు.

మీరు మంచి సినిమాని చూడండి అని ప్రేక్ష‌కుల‌కు చెబుతున్నాము. మంచి సినిమా చేయ‌క‌పోతే ఓటీటీలో చూడండి అంటున్నాం. ఓటీటీ కోసం అప్పటికే చెల్లించినందున ఉచితంగా లభించే దానికోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ ద్వారా.. ఒక ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదు. గతంలో నాకు వేరే మార్గం లేనందున నేను సినిమాలు థియేట‌ర్ల‌లో చూసేవాడిని. ఇప్పుడు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం అనేది సినిమా ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం మన సొంత వ్యాపార నమూనాను చంపుకున్నాం`` అని అమీర్ అన్నారు. ఓటీటీల పెత్త‌నంపై అమీర్ ఖాన్ నిరాశ‌ను వ్య‌క్తం చేసారు.

థియేట్రికల్ రిలీజ్‌కి స్ట్రీమింగ్ విడుదలల మధ్య కనీసం 3-4 నెలల విరామం ఉండాలని జావేద్ అక్తర్ అన్నారు. ఓటీటీలో కేవలం 4 వారాల్లోనే హిట్ సినిమా విడుదల‌వ్వ‌డం స‌రికాదు! అన్నారు. ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా, ఆమిర్ ఖాన్ -జావేద్ అక్తర్ ఇద్దరూ పరిశ్రమ పునరుజ్జీవనం గురించి ఆశావాదంగా ఉన్నారు. ఇది ఒక చక్రం లాంటిది. మీరు తప్పులు చేసి, ఆపై సరైన మార్గాన్ని ఎంచుకుంటారు! అని అమీర్ అన్నారు. దీనికి జావేద్ స్పందిస్తూ దీన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మన సైకిళ్లను కూడా అమ్ముకోవాల్సి ఉంటుంది! అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ వైఫ‌ల్యాల‌పై జావేద్ చేసిన ఈ వ్యాఖ్య అక్క‌డ ప‌రిస్థితిపై చాలా ఆలోచింప‌జేస్తోంది.

Tags:    

Similar News