ఛావా.. మనోళ్లు కనెక్టవడం గొప్ప

ఛావా.. గత మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా. హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు మామూలుగా కనెక్ట్ కాలేదు.;

Update: 2025-03-09 22:30 GMT

ఛావా.. గత మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా. హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు మామూలుగా కనెక్ట్ కాలేదు. విక్కీ కౌశల్ అంటే మిడ్ రేంజ్ హీరో. అతడికి పెద్దగా మార్కెట్ లేదు. తన సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప అన్నట్లుండేది. అలాంది ‘ఛావా’ ఐదొందల కోట్ల మార్కును అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టే ‘ఛావా’ ఏ స్థాయి సక్సెస్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఐతే ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ కథ కావడం.. తన కథను ఎంతో భావోద్వేగభరితంగా తెరకెక్కించడంతో మహారాష్ట్ర ప్రజలు ఈ సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయిపోయారు. వారితో పాటు ఉత్తరాది జనాలు కూడా సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారు. శివాజీ పేరు చెబితే మరాఠీయులు మామూలుగానే ఊగిపోతారు. ఆయన తనయుడి కథను కూడా అంతే పకడ్బందీగా రూపొందించడం.. తన వీరత్వాన్ని, చావు కళ్ల ముందుండగా కూడా తలవంచని పౌరుషాన్ని గొప్పగా చూపించడంతో సినిమా చూస్తూ కదిలిపోయారు.

ఐతే ‘ఛావా’ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. వాళ్లు దీనికి పెద్దగా పబ్లిసిటీ చేసింది లేదు. అయినా సరే సినిమాకు తొలి రోజే రూ.3 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలుస్తోంది. వీకెండ్లో ఈ సినిమా మిడ్ రేంజ్ తెలుగు సినిమాల రేంజిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుండడం విశేషం. శివాజీ తనయుడి కథ కాబట్టి మహారాష్ట్ర వాళ్లు, ఉత్తరాది జనాలు ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ.. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్నారంటే విశేషమే. దీన్ని బట్టి ‘ఛావా’ ఎవరి కథ అన్నది పక్కన పెడితే.. అదొక పకడ్బందీ సినిమా అన్నది అర్థమవుతుంది. మన వాళ్లకు పరిచయం లేని వ్యక్తి కథ అయినా సరే.. ఆ పాత్రను తెర మీద చూపించిన విధానంతో మనవాళ్లు కనెక్ట్ అయ్యారు. ఆ పాత్ర హిందీ ప్రేక్షకుల స్థాయిలో కాకపోయినా బాగానే ఓన్ చేసుకుంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న వాస్తవ గాథలకు కొంచెం ఫిక్షన్ జోడించి పకడ్బందీగా తీస్తే భాషా భేదం లేకుండా ప్రేక్షకులు మెచ్చుతారనడానికి ఇది ఉదాహరణ.

Tags:    

Similar News