అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందన ఇదే!
అలాగే బెన్ ఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి తెలంగాణలో పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు.
'పుష్ప 2' మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకి బాధ్యుడిగా అల్లు అర్జున్ పైన కేసు నమోదయింది. అందులో భాగంగా అతన్ని అరెస్ట్ చేశారు. తరువాత బన్నీ బెయిల్ పైన విడుదల అయ్యారు. ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే బెన్ ఫిట్ షోలు, ప్రీమియర్ షోలకి తెలంగాణలో పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు.
ఈ వ్యవహారంతో టాలీవుడ్ ఇండస్ట్రీ, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోందని గ్రహించిన ఇండస్ట్రీ పెద్దలు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇందులో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన చేసిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారంట.
అల్లు అర్జున్ మీద నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్న వయస్సు నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్న కూడా ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నప్పుడు చట్టప్రకారం వ్యవహరించడం నా పద్ధతి. అతని పైన తనకెలాంటి చెడు ఉద్దేశ్యం లేదని రేవంత్ రెడ్డి పెద్దలతో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
అలాగే చట్టసభల్లో బెన్ ఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై తాను చెప్పిన మాటని వెనక్కి తీసుకునే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పేశారంట. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానని పెద్దలకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సమావేశం జరగడానికి ముందే రేవతి కుటుంబానికి 'పుష్ప 2' టీమ్ రెండు కోట్లు పరిహారంగా ప్రకటించారు.
బన్నీ కోటి రూపాయిలు, నిర్మాతలు 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు ఇచ్చారు. ఈ చెక్కులని దిల్ రాజుకి అందించినట్లు తెలుస్తోంది. ఇక రేవతి కొడుకుని ఇండస్ట్రీ పెద్దలు అందరూ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోయిన టికెట్ ధరలు పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.