సీఎంతో మీటింగ్ అద్భుతం..కానీ షాకయ్యా: డైరెక్టర్ సాయి రాజేష్

ఇప్పుడు ఆయన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం నిజంగా అద్భుతంగా జరిగిందని తెలిపారు.

Update: 2024-12-26 11:23 GMT

టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు.. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పోలీస్ కంట్రోల్ సెంటర్ లో గురువారం జరిగిన సమావేశంలో పలువురు తెలుగు సినీ దర్శకులు, నిర్మాతలు, సీనియర్ అండ్ యంగ్ హీరోలు పాల్గొన్నారు. చాలా రోజులుగా ఈ మీటింగ్ కోసమే సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు.

 

అయితే రేవంత్ ను కలిసి దర్శకుల్లో త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, వశిష్ట, బలగం వేణు, వేణు శ్రీరామ్ సహా పలువురు ఉన్నారు. వారితో పాటు బేబీ ఫేమ్, డైరెక్టర్ సాయి రాజేష్ కూడా అటెండ్ అవ్వగా.. ఇప్పుడు ఆయన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం నిజంగా అద్భుతంగా జరిగిందని తెలిపారు.

కొన్ని వెబ్‌ సైట్లలో నెగిటివ్ గా ఉన్న వార్తలు చూసి షాక్ అయినట్లు చెప్పారు. పరిశ్రమ కోరిన ప్రతి విషయానికి ఆయన వెంటనే అంగీకరించారని పేర్కొన్నారు. తాము అడిగిన దానికంటే ఎక్కువగా హామీలు ఇచ్చారని వెల్లడించారు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపారు.

అయితే సమావేశానికి సానుకూల ఫలితం రావడం పట్ల సినీ ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే సమావేశంలో రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ ఉండవని తేల్చి చెప్పేశారు. తాము రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు.

ఇండస్ట్రీకి సపోర్ట్ అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. టెంపుల్ ఎకో టూరిజాన్ని ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని సూచించారు. అనంతరం చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పలు విషయాలపై చర్చించి నిర్ణయిస్తామని అన్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News