పుష్ప-2.. జస్ట్ ఎ స్మాల్ బ్రేక్
'బేబీ జాన్' రిలీజ్ రోజు 'పుష్ప-2' కొంచెం డౌన్ అయింది. కానీ మళ్లీ ఈ సినిమానే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పుష్ప-2 సినిమా రెండో వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా స్లో అయిపోయింది కానీ.. ఉత్తరాదిన మాత్రం దాని దూకుడు మామూలుగా లేదు. కొత్త సినిమా రిలీజైనట్లుగా మూడో వారంలో కూడా ఆ సినిమా థియేటర్లు జనాలతో కళకళలాడాయి. ఐతే బుధవారం మాత్రం ఈ సినిమా కొంచెం నెమ్మదించింది. అందుక్కారణం.. బాలీవుడ్ లో ఓ సినిమా భారీ అంచనాలతో విడుదల కావడం.
ఆ చిత్రమే.. బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ 'తెరి'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా ఆకర్షణలే కనిపించాయి. వరుణ్ ధావన్ లాంటి ఫాంలో ఉన్న హీరో.. తొలిసారి హిందీ చిత్రంలో నటించిన కీర్తి సురేష్.. తమన్ సంగీతం.. మాస్ ప్రోమోలు.. ఇలా ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం బాగానే ఆకర్షించినట్లు కనిపించింది. కానీ ఈ సినిమాకు ఆశించిన టాక్ మాత్రం రాలేదు. సగటు మసాలా చిత్రంగా దీన్ని చెబుతున్నారు విశ్లేషకులు, ప్రేక్షకులు.
తొలి రోజు ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించినా.. 'బేబీ జాన్' బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడే సంకేతాలు కనిపించడం లేదు. 'బేబీ జాన్' రిలీజ్ రోజు 'పుష్ప-2' కొంచెం డౌన్ అయింది. కానీ మళ్లీ ఈ సినిమానే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'పుష్ప-2' కోసం రూరల్ ఏరియాల్లో ఇప్పటికీ జనం ఎగబడుతున్నారు. క్రిస్మస్ వీకెండ్లో ఈ సినిమా వసూళ్లు కుమ్మేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 'పుష్ప-2' లాంగ్ రన్ చూసి ముందే 'బేబీ జాన్' టీంలో ఆందోళన కనిపించింది. ఐతే ఈ సినిమా రిలీజయ్యే టైంకి 'పుష్ప-2' జోరు తగ్గుతుందనుకున్నారు. తమ సినిమా కంటెంట్‌ను నమ్మారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. 'పుష్ప-2' వైపు మళ్లీ జనాలు చూసే పరిస్థితి కనిపిస్తోంది. పాత సినిమా అయిన 'పుష్ప-2' దెబ్బకు కొత్త చిత్రమైన 'బేబీ జాన్' దెబ్బ తింటే ఆశ్చర్యమేమీ లేదు. 'పుష్ప-2' హిందీ వెర్షన్ వసూళ్లు ఇప్పటికే రూ.700 కోట్లు దాటేయడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి.