పద్మభూషణ్ నాకు ఎప్పుడో రావాలని అంటుంటారు: బాలకృష్ణ
తాజాగా బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన బాలయ్య అవార్డు గురించి స్పందించారు.
నటసింహ బాలకృష్ణ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగానికి బాలయ్య చేసిన సేవలకు గానూ ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సహా ఇండస్ట్రీ ప్రముఖులు బాలయ్యకి శుభాకాంక్షలు చెప్పారు. ఓ యువ నిర్మాత అయితే ఏకంగా బాలయ్య కు భారీ సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తున్నాడనే వార్త వెలుగులోకి వచ్చింది.
తాజాగా బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన బాలయ్య అవార్డు గురించి స్పందించారు. `నిబద్దత, క్రమశిక్షణ, పట్టుదలతో మనం చేయాల్సిన పనులు చేయాలి. బిరుదుల కోసం కాదు. మనకెంతో ఇచ్చిన సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఉపయోగ పడితో ఏదైనా సాధించవచ్చు. నాకు పద్మభూషణ్ ఎప్పుడో రావాలని చాలా మంది అంటుంటారు.
నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటా. పూజలు ఎక్కువగా చేస్తుంటా. పనే నాకు దైవం. నాన్న గారి వందో జయంతి ఇటీవల పూర్తయింది. ఆయన నటించిన `మన దేశం` విడుదలై 75 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి నేను వచ్చి 50 ఏళ్లు అయింది. మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడం..విడుదలైన నాలుగు చిత్రాలు వరుసగా విజయాలు సాధించడం. ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం రావడం సంతోషంగా ఉంది.
కొన్నాళ్ల పాటు లైమ్ లైట్ లో ఉండి ఫాం తగ్గగానే ట్రాక్ మారుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతారు. కానీ నేను ఇన్ని ట్రాక్ రికార్డులతో మళ్లీ నా సెకెండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టాను. అవార్డు నాకు వచ్చిన అభిమానులంతా తమకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఇంతటి అభిమానం నాపై చూపించడం సంతోషంగా ఉంది` అని అన్నారు.