గౌరవం ఆత్మగౌరవం కోల్పోయానన్న స్టార్ హీరో
అమ్మాయిలు మిమ్మల్ని తిరస్కరిస్తారు.. మీరు వారిని వెంబడిస్తారు.. కానీ చివరికి గౌరవం దక్కదు అని అనుభవపూర్వకంగా చెప్పాడు షాహిద్.
బాగా దెబ్బలు తిన్నాక కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకున్నానని అన్నాడు ప్రముఖ స్టార్ హీరో. అప్పటివరకూ మగువతో సంబంధంలో గౌరవాన్ని కోల్పోయానని, ఆత్మగౌరవాన్ని కూడా కాలదన్నుకున్నానని అన్నాడు. ఇవన్నీ ఎవరికైనా ప్రారంభంలో అర్థం కావు.. నెమ్మదిగా అర్థమవుతాయి.. కానీ అప్పటికే డ్యామేజీ జరిగిపోతుందని తన లవ్ లైఫ్‌లో కాచి వడపోసిన జీవితానుభవాలను ఉదహరించాడు. గత సంబంధాలలో తాను గౌరవం, ఆత్మగౌరవం కోల్పోయానని పేర్కొన్న ఆ హరో మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్.
అమ్మాయిలు మిమ్మల్ని తిరస్కరిస్తారు.. మీరు వారిని వెంబడిస్తారు.. కానీ చివరికి గౌరవం దక్కదు అని అనుభవపూర్వకంగా చెప్పాడు షాహిద్. దిల్లీకి చెందిన సాంప్రదాయ కుటుంబం నుంచి మీరా రాజ్ పుత్ ని పెళ్లాడిన షాహిద్ తన పాత విషయాలను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. పెళ్లికి ముందు అతడు బెబో కరీనా కపూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా బ్రేకప్ అయ్యాడు. కరీనా తర్వాత పలువురు నటీమణులతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ షాహిద్ వాటిని ఏనాడూ ఒప్పుకోలేదు. తాజా చాటింగ్ సెషన్‌లో షాహిద్ కపూర్ తన హార్ట్ బ్రేకింగ్ రిలేషన్స్ గురించి వివరించాడు.
కొన్నిసార్లు మనం ఎవరినైనా ఎంతగానో ప్రేమిస్తాం.. వారు తిరస్కరించినప్పుడు.. ఒక స్థాయి వరకూ వెంబడిస్తాం. క్రమంగా గౌరవాన్ని కోల్పోతాం. గౌరవాన్ని త్యాగం చేస్తాం. ఈ ప్రక్రియలో ఆత్మగౌరవాన్ని కోల్పోయామని కూడా గ్రహించము. చాలా జరిగిపోయాక.. చివరికి అసలు నేనేం చేస్తున్నాను! అని ఆలోచిస్తారు. అప్పటికే పరిస్థితి అదుపుతప్పి పోతుంది. అసలు మనకు ఎలాంటి మగువ కావాలో నిర్ణయించుకోవాలి. ఎలాంటి వారితో రిలేషన్ కావాలో నిర్ణయించుకోకపోతే చాలా కోల్పోతారు. నా విషయంలో ఎదుర్కొన్న వాటి నుంచి నాకు భాగస్వామిలో ఏ లక్షణాలను కోరుకుంటున్నానో అర్థమైందని, పరిస్థితులు అన్నిటినీ నేర్పించాయని షాహిద్ పేర్కొన్నాడు.
ప్రేమలో పడటం వేరు..వారితో మంచి చెడు షేర్ చేసుకోవడం వేరు! ఎందుకంటే చివరివరకూ మనం ఆమెతోనే జీవించాలి కదా! అని షాహిద్ అన్నారు. లవ్ లైఫ్ లో నేను చివరికి తెలుసుకున్నది ఏమిటి అంటే.. ఎదుటి వ్యక్తి అవసరం మనకు ఉండకూడదు. వారి నుంచి ఏదీ ఆశించకూడదు. అలాంటి ప్రేమ చాలా స్వార్థపూరితమైనది అని షాహిద్ అన్నారు. నేను అవసరంలో ఉన్నాను... నాకు ఓదార్పు అవసరం.. నేను తనకు చాలా ముఖ్యమైనవాడిని.. నేను ఈ వ్యక్తిని దాటి చూడలేను అనుకుంటే, ఇదంతా స్వార్థపూరితం. మనమంతా అలాంటి ప్రేమ, శ్రద్ధను కోరుకుంటున్నాం కానీ చివరికి సంబంధంలో ఇవ్వగలగాలి. మీరు ఇచ్చేవారిగా అవతలి వ్యక్తికి అర్థం కావాలి అని అనుభవంతో చెప్పాడు షాహిద్.
షాహిద్ కపూర్ 2015లో మీరాను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ పుత్ అమ్మాయిని చూశాక షాహిద్ వెంటనే ఓకే చెప్పగా, అతడికి ఓకే చెప్పడానికి ఆమెకు ఆర్నెళ్లు పట్టిందట. ఇద్దరి మధ్యా 13 సంవత్సరాల వయస్సు తేడా ఉన్నా.. ఈ జంట కలిసి అందమైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. షాహిద్- మీరా 2016లో తమ మొదటి బిడ్డ మిషాను స్వాగతించారు. వారి కుమారుడు జైన్ 2018లో జన్మించాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే షాహిద్ నటించిన దేవా థియేటర్లలో విడుదలైంది. ఇది మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. మసాలా ఎలిమెంట్స్ తో మాస్ కి కనెక్టవుతుందని సమీక్షలు వచ్చాయి. దీనికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు.