శ్రీకాంత్ నటవారసుడు బిగ్ ప్లానింగ్స్
శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ సినీకెరీర్ కోసం అద్భుత ప్రణాళికలు రచించారు.;
టాలీవుడ్‌లో 100 సినిమాల నటుడు అవ్వడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి అరుదైన ఫీట్ వేసాడు ప్రతిభావంతుడైన శ్రీకాంత్. ఆరంభం విలన్ వేషాలతో మొదలై, ఆ తర్వాత కొన్ని సహాయపాత్రల్లో మెరిసి, కథానాయకుడిగా ఎదిగిన శ్రీకాంత్ 100 పైగా చిత్రాల్లో నటించాడు. అతడికి మెగా అండదండలు పుష్కలంగా ఉండటం ప్రధాన బలం. మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అని పిలవడమేగాక, చిరు సినిమాల్లో శ్రీకాంత్ నటించాడు. మెగా హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషించాడు.
శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ సినీకెరీర్ కోసం అద్భుత ప్రణాళికలు రచించారు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రోషన్ ఆ తర్వాత పెళ్లి సంద-డిలో నటించాడు. ఈ రెండు సినిమాల్లో అతడి ఛామింగ్ లుక్స్, డ్యాషింగ్ యాటిట్యూడ్, నటన ఫ్యాన్స్ కు నచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్ తర్వాత అంత ఛామ్ ఉన్న కథానాయకుడిగాను రోషన్ కి గాళ్స్ లో ఫాలోయింగ్ ఉంది. అతడు నటించే ప్రతి సినిమాతో పరిణతి ని చూపాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రోషన్ కెరీర్ గురించి శ్రీకాంత్ పెద్ద ప్లానింగ్స్ తో ఉన్నారని సమాచారం. ఇప్పటికే వైజయంతి మూవీస్ లో స్పోర్ట్స్ డ్రామా- చాంపియన్స్ కోసం శ్రమిస్తున్న రోషన్, తదుపరి లింగుస్వామితో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. రోషన్ తో సినిమాని పూర్తి చేసి తన మహాభారత్ ప్రాజెక్ట్ కోసం లింగుస్వామి ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అలాగే రోషన్ వరుస సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీ కానున్నాడని తెలిసింది. తెలుగులో నలుగురు దర్శకులు క్యూలో ఉన్నారు.. కొన్ని కథలు ఫైనల్ అవుతున్నట్టు తెలిసింది. వీటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రోషన్ నటించిన క్రీడా నేపథ్య సినిమా `చాంపియన్స్` ఈ ఏడాది విడుదల కానుంది.