బీ టౌన్ విష‌పూరితంగా మారింది.. అందుకే వ‌దిలేస్తున్నా: అనురాగ్ క‌శ్య‌ప్

త‌ను తీసిన సినిమాల ద్వారా అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్.;

Update: 2025-03-06 08:30 GMT

త‌ను తీసిన సినిమాల ద్వారా అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్. గులాల్, బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి గొప్ప సినిమాల‌ను తీసిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ బాలీవుడ్, ముంబై ను పూర్తిగా వ‌దిలేసిన‌ట్టు అధికారికంగా తెలిపాడు. అనురాగ్ ప్ర‌స్తుతం ముంబై నుంచి త‌న మ‌కాంను బెంగుళూరుకు మార్చి, సౌత్ సినిమాల‌పై ఫోక‌స్ చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలో ఆయ‌న హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బాలీవుడ్ మొత్తం ఎంతో విష‌పూరితంగా మారింద‌ని, అక్క‌డి నిర్మాత‌ల ఆలోచ‌నలు చూసి త‌న‌కు పిచ్చెక్కిపోయింద‌ని అందుకే ముంబైని, బాలీవుడ్ ను వ‌దిలేసి సౌత్ లో సెటిలైపోతున్న‌ట్టు ఆయ‌న తెలిపాడు. అంతేకాదు, సౌత్ తో చేసిన‌ట్టు బాలీవుడ్ లో ఎక్స్‌పెరిమెంట్స్ చేయ‌ర‌ని ఆయ‌న అన్నారు.

హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ చాలా దారుణంగా త‌యారైంద‌ని, సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచే మూవీ ఎంత బిజినెస్ చేస్తుంద‌ని, సినిమాను ఎలా అమ్ముదాం, ఎంత లాభ‌మొస్తుంద‌ని బిజినెస్ యాంగిల్ లోనే చూస్తున్నార‌ని, దాని వ‌ల్ల డైరెక్ట‌ర్ కు సినిమా తీసే ఆనందం మిస్ అవుతుంద‌ని, బాలీవుడ్ లో ప్ర‌తీ ఒక్క‌రూ అసాధ్య‌మైన టార్గెట్ల‌తోనే మూవీస్ ను స్టార్ట్ చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపాడు.

మినిమం రూ.500 కోట్లు, రూ.800 కోట్లు క‌లెక్ష‌న్స్ చేసే సినిమాల‌నే తీయాల‌ని అక్క‌డ నిర్మాత‌లు ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తుంటార‌ని, దీంతో అక్క‌డ కొత్త టాలెంట్ కు ఎక్కువ అవ‌కాశాలు రావ‌డం లేదని ఆయ‌న పేర్కొన్నాడు. బాలీవుడ్ ను చూస్తే అస‌హ్య‌మేస్తుంద‌ని, తను తీసే సినిమాల‌కు డ‌బ్బులు రావ‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ని, త‌న‌ని, త‌న సినిమాను నిర్మాతలు న‌మ్మ‌డం లేద‌ని, అందుకే అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వచ్చేసిన‌ట్టు అనురాగ్ పేర్కొన్నాడు.

ఇక మీద‌ట తాను సౌత్ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాన‌ని చెప్తోన్న అనురాగ్ క‌శ్య‌ప్ ఇప్ప‌టికే సౌత్ లో న‌టుడిగా ప‌లు సినిమాల్లో న‌టించాడు. గ‌తేడాది మ‌హారాజా మూవీలో విల‌న్ గా న‌టించి మంచి మార్కులు కొట్టేసిన అనురాగ్, టాలీవుడ్ లోకి డెకాయిట్ మూవీ ద్వారా డెబ్యూ చేయ‌నున్నాడు. అడివి శేష్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అనురాగ్ క‌శ్య‌ప్ నిజాయితీ గ‌ల పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.

Tags:    

Similar News