ఒకే రోజు.. 14 సినిమాలు..

Update: 2017-11-14 17:30 GMT
సినిమా థియేటర్లకు ఉన్నట్టుండి రిలీజుల పండగొచ్చింది. పెద్ద హీరోల సినిమాలేవీ థియేటర్ల లో లేకపోవడం... కొత్తగా వస్తున్నవన్నీ అంతగా హైప్ లేని మీడియం బడ్జెట్ చిత్రాలే కావడంతో నిర్మాతలకు కాస్త ధైర్యమొచ్చింది. అందుకే షూటింగు పూర్తయి చాలా రోజులుగా రిలీజ్ చేయకుండా అలాగే ఉంచేసిన సినిమాలను థియేటర్లకు తీసుకొస్తున్నారు.

ఈ వారం కొత్తగా రిలీజ్ కానున్న సినిమాలు 14 వరకు ఉన్నాయనే న్యూస్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ 14 సినిమాల్లో అసలెప్పుడు తీశారో.. అందులో ఎవరు నటించారో తెలియనివే ఎక్కువ ఉండటం విశేషం. ఈవారం రిలీజవుతున్న వాటిలో రెండు డబ్బింగ్ సినిమాలున్నాయి. వాటిలో కార్తి - రకుల్ జంటగా నటించిన ఖాకీ.. సిద్ధార్ధ - ఆండ్రియా నటించిన గృహం ఉన్నాయి. వాస్తవానికి గృహం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదాలు పడుతూ ఇప్పటికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతోపాటు తెలుగు బిగ్ బాస్ విజేత శివబాలాజీ స్వయంగా నిర్మించి.. నటించిన స్నేహమేరా జీవితం కూడా ఇదే వారం రిలీజ్ కానుంది. ఇవి మినహా మిగిలిన సినిమాల్లో అనామకమైనవే అత్యధికం ఉన్నాయి.

‘‘ఒక్కవారం 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆశ్చర్యంగానే ఉంది. వీటిలో రెండు.. మూడు సినిమాలకు మాత్రమే బిజినెస్ జరిగింది. మిగిలిన వాటికి థియేటర్ రెంట్లు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అయినా వాటి ప్రొడ్యూసర్లు సొంతంగా రిస్క్ చేస్తున్నారు.’’ అని ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద మనిషి అంటున్నారు.  సింపుల్ గా చెప్పాలంటే సినిమా రిలీజ్ చేస్తే హిట్ కొట్టామనుకుని సంబరపోడిపోయే బాపతే ఎక్కువన్నమాట. అదీ సంగతి



Tags:    

Similar News