అమెరికాలో '2.0' కు ఏమైంది?

Update: 2018-11-30 08:45 GMT
ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చలన్నీ ‘2.0’ చుట్టూనే తిరుగుతున్నాయి. గురువారం విడుదలైన ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సినిమా అద్భుతమంటున్నారు. కొందరేమో ఒకసారి చూడటానికి ఢోకా లేదంటున్నారు. ఇంకొందరు అంచనాలకు తగ్గట్లు లేదంటున్నారు. ఇక వసూళ్ల సంగతి చూసినా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డుల్ని కొట్టేస్తుందన్న అంచనాలు ఫలించలేదు.

ఇంకా తొలి రోజు పూర్తి కలెక్షన్ల వివరాలు బయటికి రావాల్సి ఉంది కానీ.. ప్రాథమిక అంచనాల ప్రకారం అయితే ‘బామహుబలి-2’ రికార్డులకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు. ‘2.0’ దానికి దగ్గరగా వచ్చి ఆగిపోయేలా ఉందంటున్నారు. ఇంత పెద్ద కాంబినేషన్.. ఇంత బడ్జెట్.. ఇన్ని అంచనాల మధ్య వచ్చిన సినిమా ‘బాహుబలి-2’ను కొట్టకపోవడం ఏంటి అని కొందరంటుంటే.. ‘బాహుబలి-2’ క్రేజ్ వేరు.. దాంతో పోలికే తప్పు.. మామూలుగా చూస్తే ‘2.0’కు వస్తున్న వసూళ్లే గొప్పే అని కొందరంటున్నారు. తొలి రోజు ఈ చిత్రం రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా.

ఇండియా వరకు ‘బాహుబలి-2’కు దీటుగానే కనిపిస్తున్న ‘2.0’ అమెరికాలో మాత్రం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ ప్రిమియర్లతో కలిపి తొలి రోజు పూర్తయ్యేసరికే ‘బాహుబలి-2’ 4 మిలియన్ మార్కును టచ్ చేసింది. కానీ ‘2.0’ 1.5 మిలియన్ మార్కు లోపే ఆగిపోయేలా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రిమియర్లతో కలిపి 1.3-1.4 మిలియన్ డాలర్ల మధ్య రాబట్టినట్లు చెబుతున్నారు. శుక్రవారానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు రావాలంటే ఆ చిత్రం 7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయాలి. అర్లీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఆ ఫీట్ అంత వీజీ కాదనిపిస్తోంది.
Tags:    

Similar News