రానున్న‌ది వ‌ర్షాకాలం.. అందుకే 6 కోట్ల సెట్లో స్పీడ్ గా!

Update: 2021-05-02 05:05 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ షూటింగుల‌న్నీ బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 25 వ‌ర‌కూ సినిమాల షూటింగుల్ని తాత్కాలికంగా ర‌ద్దు చేసుకున్నారు. త్వ‌ర‌లోనే వీటిని ప‌ట్టాలెక్కించాల‌న్న త‌ప‌న ఉన్నా కోవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల నెల‌రోజుల వాయిదా త‌ప్పేట్టు లేదు.

అయితే ఇలాంటి స‌న్నివేశంలో కూడా `శ్యామ్ సింఘ‌రాయ్` షూటింగ్ నిరాటంకంగా సాగుతోంది. నానీ ఏ విష‌యంలోనూ త‌గ్గ‌డం లేదు. ఈ మూవీ కోసం ఏకంగా 6.5 కోట్ల బ‌డ్జెట్ తో భారీ కోల్ క‌తా సెట్ వేసి చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీకి రాకుండా పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నారు. ఈ కోవిడ్ క‌ష్ట‌కాలంలో త‌న నిర్మాత‌ల‌కు ఏ క‌ష్టం క‌ల‌గ‌కూడ‌ద‌ని హీరో నానీ త‌న‌వంతు షూటింగ్ కి సాయం చేస్తున్నారు.

అయినా ఇప్పుడున్న ప్ర‌మాదంలో ఇంత రిస్కు చేయాలా? అన్న ప్ర‌శ్న‌కు స‌హేతుక కార‌ణం చెబుతోంది టీమ్. దాదాపు 6.5 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన భారీ సెట్ లో వెంట‌నే షూట్ పూర్తి చేయ‌క‌పోతే కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. కోల్ క‌త నుంచి ఆర్టిస్టులు.. జూనియ‌ర్లు వ‌చ్చి ఇక్క‌డ న‌టిస్తున్నారు. పైగా క్యాన్సిల్ చేస్తే చాలామంది ఆర్టిస్టుల కాల్షీట్ల‌తోనూ స‌మ‌స్య ఉంటుంది. ఈ భారీ సెట్లో దేవాల‌యాల నిర్మాణం స‌హా ఆర్కిటెక్చ‌ర్ తో చేసిన‌వి క్లే(మట్టి)తో నిర్మించిన ప్రాకారాలు ఉన్నాయి. రానున్నది అస‌లే వ‌ర్షాకాలం. ఇలాంట‌ప్పుడు సెట్ ని కాపాడుకోవ‌డం క‌ష్టం. దానికి తోడు కాల్షీట్ల‌ను రీఎరేంజ్ చేయ‌డం పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం. అందుకే ఈ రిస్కులేవీ లేకుండా శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసేస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లోనే చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోతుంద‌ని తెలిసింది. అందుకే నాని స‌హా ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్ నుంచి అన్ని విధాలా స‌హ‌కారం అందుతోంది.

ఇటీవ‌ల సెకండ్ వేవ్ వ‌ల్ల‌ చిరంజీవి.. ప్ర‌భాస్.. మ‌హేష్‌.. తార‌క్ స‌హా స్టార్లంతా ప్ర‌స్తుతం షూటింగులు ఆపేసి ఇండ్ల‌లోనే ఉన్నారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చాక బ‌న్ని కూడా పుష్ప చిత్రీక‌ర‌ణ‌ను ఆపేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News